దేశాన్ని కోవిడ్ నరకంలో ముంచేశారంతే.!

Covid 19 Emergency, The Real Culprits Are..

Covid 19 Emergency, The Real Culprits Are..

‘నేరం నాది కాదు’ అని అందరూ తప్పించుకోవచ్చుగాక. కానీ, 130 కోట్ల మంది ప్రజానీకం కోవిడ్ నరకంలో మునిగిపోయారు. దేశం ఈ గండం నుంచి గట్టెక్కేదెలా.? అసలు ఎవరిది ఈ పాపం.? మాస్క్ అవసరం గురించి ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకోని ప్రతి భారతీయుడికీ ఈ పాపంలో భాగం దక్కుతుంది. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించిన ప్రతి రాజకీయ నాయకుడూ ఈ పాపంలో భాగం పంచుకుని తీరాల్సిందే. ఏ ప్రభుత్వాలైతే ప్రజల్ని అప్రమత్తం చేశాయో, ఆ ప్రభుత్వాల్ని నడుపుతున్న రాజకీయ నాయకులే, విచ్చలవిడిగా జనాన్ని పోగేశారు తమ రాజకీయ అవసరాల కోసం. అదే దేశాన్ని ఈ రోజు ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేసింది. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా.. రాజకీయ కార్యక్రమాలు దేశంలో నడిచాయి. వంద మందో, వెయ్యి మందో కాదు.. లక్షల మందిని రాజకీయ కార్యక్రమాల కోసం రాజకీయ పార్టీలు (ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేకుండా) పోగేశాయి. మద్యం దుకాణాల్ని బార్లా తెరిచేశారు.. ఇంకా చాలా చాలానే చేశారు. వెరసి, దేశం ఈ కరోనా నరకం నుంచి బయటపడటం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ‘అందరికీ వ్యాక్సిన్ అవసరం వుండకపోవచ్చు..’ అని ప్రభుత్వాలు చెప్పిన మాటలు, జనానికి ఇంకోలా అర్థమయ్యాయి.

మద్యం దుకాణాల్ని తెరిచి, జనం పోగుపడే అనేక కార్యక్రమాలకు అనుమతులిచ్చి, ప్రభుత్వాలే ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చాయి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్.. అనే హెచ్చరిక వైద్య నిపుణుల నుంచి వచ్చినా, ప్రభుత్వాలు తేరుకోలేదు.. ప్రజల్ని అప్రమత్తం చేయలేదు. అదే సమయంలో, డాక్టర్లు ఎంత మొత్తుకుంటున్నా ప్రజలూ పట్టించుకోలేదు. ఒకే రోజు 2 లక్షల కొత్త కరోనా పాజిటివ్ కేసులంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రానున్న రోజుల్లో ఈ నెంబర్ ఇంకెంతగా పెరుగుతుందో ఏమో. యాక్టివ్ కేసులు సంఖ్య పెరగడమంటే, అది దేశంలో అందుబాటులో వున్న వైద్యుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. వైద్యలపై కరోనా పంజా విసిరితే.. ఆ తర్వాత బాధిత ప్రజలంతా ఏమైపోతారు.?