Pakija: ఒకప్పటి లేడీ కమెడియన్, నటి వాసుకి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఇంతకుముందు సినిమాలను బాగా చూసే వారికి ఈమె బాగా సుపరిచితమే. వాసుకి అంటే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ పాకీజా అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆ పాత్రతో అంతగా ఫేమస్ అయ్యింది పాకీజా. మరి ముఖ్యంగా బ్రహ్మానందంతో ఆమె కలిసి చేసిన కామెడీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి సెలబ్రిటీ లైఫ్ ను లీడ్ చేసిన పాకీజా ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
అవకాశాలు దూరం అవ్వడంతో జీవించడం కూడా కష్టంగా మారిపోయింది.. దానికి తోడు సంపాదించిన ఆస్తిని పోగొట్టుకొని ఖాళీ చేతులతో కడుపు మార్చుకుంటూ బతకడానికి ఇబ్బంది పడే దుస్థితిలో ఉంది. అయితే పాకీజాకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది సినీ ప్రముఖులు ఆమెకు అండగా నిలిచి ఆర్థికంగా సహాయం చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య ఒకసారి తిరుపతి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు 7.5 లక్షల వరకు సహాయం అందింది. ఆ డబ్బు నేను వృధాగా ఖర్చు చేయలేదు. ఆ డబ్బులో మూడున్నర లక్ష అప్పు తీర్చుకున్నాను. హైదరాబాద్ లో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను. వంటసామాగ్రి కొనడం ఇక్కడి నుంచి చెన్నై, కారైకూడి, మధురై వెళ్లడం ఇలా వీటికే డబ్బంతా అయిపోయింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళనాడు వెళ్లిపోయాను. అక్కడ రేకుల ఇంటికి వెయ్యి రూపాయాలు అద్దె కట్టడానికి కష్టమైపోయిందని ఇంట్లో పాచిపని చేస్తానని చెప్పినా ఎవరూ పనివ్వడం లేదని తాను నటినని దూరం పెడుతున్నారు. ఆరు నెలల్లో పిచ్చిదాన్నైపోతానేమో అనిపించింది. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. పది రూపాయల ఇడ్లీ పిండి కొనుక్కుంటే అది రెండు రోజులు వచ్చేది. ఉదయం, సాయంత్రం ఇండ్లీ చేసుకునేదాన్ని అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.