తీస్కోండి, రాస్కోండి, మూస్కోండి.! ఏంటీ భాష దిల్ రాజుగారూ.!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట మీద అదుపు కోల్పోయారు. ‘మూస్కోండి’ అంటూ మీడియా మీద విరుచుకుపడ్డారు. సినిమాలు చూసే సగటు సినీ ప్రేక్షకులే ఇప్పుడు క్రిటిక్స్‌గా మారుతున్నారు. ఏదన్నా సినిమా విడుదలైతే చాలు, ముందుగా సినిమా చూసిన సామాన్యులే రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

సినీ పరిశ్రమలో ఏం జరిగినా, వాటిని జనానికి సినిమానే పరిచయం చేస్తోంది. ‘మా’ ఎన్నికల్ని సాధారణ ప్రజలకు అవసరమైన సగటు రాజకీయాల్లా సినీ జనాలే పరిచయం చేశారన్నది బహిరంగ రహస్యం. వెయ్యి మంది కూడా సభ్యులు లేని ‘మా’ అనే ఓ చిన్న అసోసియేషన్ రాజకీయాల కోసం రోడ్డున పడ్డారు అప్పట్లో సినీ జనాలు.

ప్రస్తుతానికి వస్తే, ఓ వైపు షూటింగులు ఆపేసుకున్నారు నిర్మాతలు.. కానీ, నిర్మాత దిల్ రాజుకి చెందిన ‘వారసుడు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు తీస్తోన్న తెలుగు సినిమా (తమిళ హీరోతో బై లింగ్వల్ సినిమా) అయినప్పుడు, దాని షూటింగ్ ఎలా జరుగుతోందబ్బా.? అని నెటిజన్ల అడిగితే అది తప్పెలా అవుతుంది.?

ఓ యంగ్ హీరో సినిమా అకారణంగా పదే పదే వాయిదా పడుతోంటే, దానికి నిర్మాత దిల్ రాజు కారకుడయ్యాడన్న ప్రశ్న సామాన్యుల నుంచి వస్తే, ఆ హీరోనే తన సినిమా ఆలస్యంపై ఆవేదన వ్యక్తం చేస్తే, దానిపై సగటు సినీ ప్రేక్షకుడు ఆరా తీస్తే, దాన్ని మీడియా కవర్ చేయడమెలా తప్పువుతుందో దిల్ రాజుకే తెలియాలి.

సాధారణ రాజకీయాల్ని మించి సినీ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ నాయకులెలాగైతే మీడియాని బెదిరిస్తున్నారో, ఆ స్థాయిలోనే మీడియాపై కస్సుమంటున్నారు దిల్ రాజు. ‘మూస్కో’ అని మీడియాకి చెప్పడానికి దిల్ రాజు ఎవరు.? అన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

మీడియాని మూస్కోమన్నంతమాత్రాన ‘కార్తికేయ-2’ సినిమాకి జరిగిన అన్యాయం గురించి జనం మర్చిపోతారనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. సినిమా హిట్టయ్యింది కాబట్టి ఓకే.. కాస్త టాక్ అటూ ఇటూగా వుంటే.. ఆ ఎఫెక్ట్.. యంగ్ హీరో నిఖిల్ మీద ఏ స్థాయిలో పడేది.?