Chiru Meet With Jagan : తెలుగు సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నది ఓ ఆరోపణ. థియేటర్లపై దాడులు, సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు.. ఇవన్నీ సినీ పరిశ్రమను దెబ్బతీసేవేనన్న ప్రచారం జరుగుతోంది. పరిశ్రమ తరఫున పలువురు ఈ విషయమై గొంతెత్తి నినదించారు కూడా.
ఇంతలోనే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ‘పరిశ్రమకు త్వరలోనే తీపి కబురు అందుతుంది..’ అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతో, ‘ఎప్పుడెప్పుడు ఆ తీపి కబురు వస్తుందా.?’ అని అంతా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఏపీ ముఖ్యమంత్రితో చిరంజీవి భేటీ వల్ల సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందంటూ ‘బంగార్రాజు’ సినిమా ఈవెంట్ సందర్భంగా అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలతో, ‘ఆ మేలు ఏంటి.?’ అన్న చర్చ మళ్ళీ మొదలైంది. ‘టక్ జగదీష్’ లాంటి సినిమాలు ఏపీలోని అధికార పార్టీ తీరు కారణంగా ఓటీటీలో విడుదలవ్వాల్సి వచ్చింది.
టిక్కెట్ల ధరలు పెంచకపోవడం వల్లనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడిందన్న వాదనా లేకపోలేదు. దానికి కరోనా తోడయ్యిందనుకోండి.. అది వేరే సంగతి. సినిమా టిక్కెట్ల ధరల విషయమై వైఎస్ జగన్ సర్కార్ ‘మరో ఆలోచన లేదు’ అని తెగేసి చెబుతున్న సంగతి తెలిసిందే. మరెలా సినీ పరిశ్రమకు తీపి కబురు అందుతుంది.?
చిరంజీవి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవడంపై నాగార్జున చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి సరే, నాగార్జున చెబుతున్నట్లు చిరంజీవి భేటీ వల్ల సినీ పరిశ్రమకు ఎప్పుడు లాభం చేకూరుతుంది.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.