కోవిడ్ సెకండ్ వేవ్ సినిమాల విడుదలనే కాదు షూటింగ్లను కూడ ఇరకాటంలో పడేస్తోంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిసినా చాలామంది ధైర్యం చేసి షూటింగ్స్ జరుపుతూ వచ్చారు. ఒకవేళ లాక్ డౌన్ పడితే ఆలోపు షూటింగ్ ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం కావొచ్చని అనుకున్నారు. కానీ వారి ప్లాన్స్ అన్నీ తలకిందులు అవుతున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ కూడ ఉంది. దర్శకుడు కొరటాల శివ వీలైనంత వేగంగా షూట్ ఫినిష్ చేయాలని అనుకున్నారు. చిరంజీవి కూడ పూర్తి సహకారం అందించారు. కానీ అది సాధ్యపడలేదు.
ఇంకొంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది అనగా సినిమా నిలిచిపోయింది. దీంతో రిలీజ్ వాయిదాపడింది. అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే మే13న చిత్రం రిలీజయ్యేదే. కానీ అభిమానుల్ని నిరాశపరుస్తూ ఆగిపోయింది. మరి కొత్త రిలీక్ డేట్ ఎప్పుడూ అంటే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొందరేమో దసరా, దీపావళి అంటుంటే ఇంకొందరు మాత్రం ఏకంగా 2022 సంక్రాంతి అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. అయితే చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్న సంగతి ఏమిటి అంటే చిత్రం ఆగష్టు లేదా సెప్టెంబర్ నాటికి రావొచ్చు అని.
ప్రజెంట్ నడుస్తున్న లాక్ డౌన్ ఇంకో నెల కొనసాగిన జూలై నాటికి షూటింగ్ మొదలుకావొచ్చు. అప్పటి నుండి మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులకు ఒకటిన్నర లేదా రెండు నెలల టైమ్ పడుతుంది. కాబట్టి ఆగష్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ నెలలో ‘ఆచార్య’ రిలీజయ్యే అవకాశం ఉందట. సో.. ‘ఆచార్య’వచ్చే ఏడాది అనే వార్తల పట్ల అభిమానులు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.