రిప‌బ్లిక్ డే రోజు ఆర్ఆర్ఆర్ టీజ‌ర్‌.. వాయిస్ ఓవ‌ర్ ఎవ‌రు ఇస్తున్నారో తెలుసా?

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఓటమెరుగ‌ని విక్ర‌మార్కుడిలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న రాజ‌మౌళి ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా అలియా భ‌ట్, ఒలీవియా మోరిస్ న‌టిస్తున్నారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. క‌రోనా లేక‌పోయి ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా థియేట‌ర్స్‌లోకి వ‌చ్చి ఉండేది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కులు అంతా ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ధారులు ఎన్టీఆర్, రామ్ చ‌రణ్‌ల‌కు సంబంధించి సోలో టీజ‌ర్స్ రిలీజ్ చేశాడు జ‌క్క‌న్న‌. ఇవి రెండు స‌రికొత్త రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు జ‌న‌వరి 26 రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ నుండి మ‌రో టీజర్ విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు టీజ‌ర్‌కు వాయిస్ ఓవ‌ర్ అందించేందుకు మెగాస్టార్ చిరంజీవిని కూడా సంప్ర‌దించిన‌ట్టు టాక్. దావానంలా వ్యాపించిన ఈ వార్త‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

ఇటీవ‌ల 50 రోజుల పాటు నైట్ షెడ్యూల్ చేయ‌గా, ఈ షెడ్యూల్‌లో హై ఆక్టోన్ యాక్ష‌న్ సీక్వెన్స్ ని రూపొందించార‌ట‌. ఇది సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఈ ఫైట్ ఉండ‌నున్న‌ట్టు ఇన్‌సైడ్ టాక్‌. డీవీవీ దాన‌య్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఎస్ఎస్ రాజ‌మౌళి సినిమా అంటే ఏ రేంజ్ లో ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా సినిమా తీయ‌డంలో దిట్ట జ‌క్క‌న్న‌. ఈ సినిమాతో ఆయన మ‌రో చరిత్ర సృష్టిస్తాడని అందరు భావిస్తున్నారు.