తెలుగు రాష్ట్రాల్లో జాలై నెలలో సినిమా హాళ్లు తెరవాలని థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించాయి. చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో థియేటర్లు తెరుచుకోగానే వరుస విడుదలలు ఉండబోతున్నాయి. అయితే ఇక్కడే ఒక ఇబ్బంది ఉంది. అదే తగ్గిన టికెట్ ధరలు. లాక్ డౌన్ ముందు ప్రభుత్వం టికెట్ రేట్లను భారీగా తగ్గించింది. ఈ ధరలతో సినిమా హాళ్లు నడపడం వీలుపడదని అప్పుడే ఓనర్లు చేతులు ఎత్తేశారు. మళ్లీ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతున్న వేళ అవే ధరలు కొనసాగిస్తే నష్టాలు తప్పవని భావిస్తున్నారు. సినిమా పెద్దలు సైతం ఈ రేట్లతో సినిమాలు రిలీజ్ చేస్తే నష్టపోవలసి వస్తుందని అంటున్నారు.
ఆగష్టు నెల నుండి ‘ఆచార్య, అఖండ, ఖిలాడి, రాధేశ్యామ్, కేజీఎఫ్ 2, పుష్ప’ లాంటి సినిమాలు విడుదలకానున్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు తగ్గిన టికెట్ ధరలు అస్సలు వర్కవుట్ అవ్వవు. అందుకే ఈ విషయమై సీఎం జగన్ వద్దకు వెళ్లాలని సినీ పెద్దలు నిర్ణయించారట. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఒక టీమ్ జగన్ వద్దకు వెళ్లి సమావేశం పెట్టుకుని టికెట్ ధరలను పెంచాలని ప్రపోజల్ పెడతారట. గతం లాక్ డౌన్ సమయంలో కూడ చిరంజీవి సినిమా హాళ్ల ఓపెనింగ్ విషయమై ముఖ్యమంత్రితో చర్చలు జరిపి సత్పలితాలు రాబట్టిన సంగతి తెలిసిందే. మరి ఈసారి కూడ అలానే టికెట్ ధరల మార్పు విషయంలో ప్రభుత్వం వైఖరి మారేలా చేయగలరేమో చూడాలి.