కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ కొరత బాధితులను విపరీతంగా వేధిస్తోంది. ఆక్సిజన్ వనరులు సరిపోక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మీదట ఎవరూ ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ బ్యాంక్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కార్యాచరణను సిద్ధం చేశారు.
పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించి ఆక్సిజన్ సిలిండర్లను సేకరించారు. ఇప్పటివరకు సేకరించిన సిలిండర్లను మొదటి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాలకు పంపారు. ఈరోజు నుండి ఆ రెండు జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ మొదలుకానున్నాయి. రేపు కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు ఇంకో ఐదు జిల్లాల్లో ఈ బ్యాంక్స్ ఓపెన్ కానున్నాయి. ఇంకో వారం పది రోజుల్లో అన్ని జిల్లాల్లో ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయాలనేది చిరంజీవి సంకల్పం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోసం అభిమానులు ఎలాగైతే చేయూతనిచ్చారో ఆక్సిజన్ బ్యాంక్స్ కోసం కూడ తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు.