కరోనా మహమ్మారి ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసింది. అడుగు తీసి బయటపెట్టాలంటే వణికిపోవల్సి వస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కరోనా బారిన పడుతుండడం కలవర పరుస్తుంది. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అంతా షాకయ్యారు. తనకి కరోనా సోకిందనే విషయం స్వయంగా చిరంజీవే ప్రకటించడంతో అభిమానులు ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.
కరోనా సోకిందేమోననే భయంతో నాలుగు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న చిరంజీవి తనకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో మూడు చోట్ల టెస్ట్ చేయించుకున్నారు. మూడు టెస్ట్‌లలోను నెగెటివ్ రావడంతో నాసిరకం కిట్ వలన తనకు ముందుగా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారన్నారు. చిరు చెప్పిన గుడ్ న్యూస్ తో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా సంతోషించారు. అయితే తనకు కరోనా సోకలేదని భావించిన చిరు దీపావళి రోజున తన గురువు విశ్వనాథ్‌ని సతీసమేతంగా కలిసారు. సినిమా విషయాలతో పాటు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పాజిటివ్ వచ్చిన చిరంజీవి బయటక తిరగడంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందు పాజిటివ్ వచ్చి, తర్వాత నెగెటివ్ వచ్చిన కొద్ది రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని అన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరిగా ఫాలో అవ్వాలన్నారు.ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరు శాతం కచ్చితమైన రిజల్ట్ ఇవ్వదు. పాజిటివ్ వస్తే పాజిటివ్ గానే భావించాలి. నెగెటివ్ వచ్చిన , లక్షణాలు లేకున్నా క్వారంటైన్‌లో ఉండి స్వీయ జాగ్రత్తలు తప్పనసరిగా తీసుకోవాలని శ్రీనివాసరావు అన్నారు. ఆచార్య షూట్‌లో చిరు జాయిన్ అవుతాడని అందరు భావిస్తున్న సమయంలో శ్రీనివాసరావు ఇచ్చిన ట్విస్ట్ అభిమానులకి షాకింగ్ గా మారింది.