కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్ తో ఓటర్ ఐడీని అనుసంధానం చేస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ…. ఓటర్ ఐడీకి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తామని చెప్పారు. దీనివల్ల ఓటు హక్కు పరిరక్షణకు వీలవుతుందని అన్నారు. ఎవరు ఓటు వేశారో, ఎవరు వేయలేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.
ఓటర్ ఐడీకి ఆధార్ ను అనుసంధానం చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. ఆధార్ తో అనుసంధానిస్తే నకిలీ ఓట్లు తొలగిపోతాయని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడింది. ఓటర్ ఐడీని ఆధార్ తో అనుసంధానం చేస్తే… నకిలీ ఓట్లను సులభంగా తొలగించవచ్చు. ఒక్కొక్కరు కేవలం ఒక ఓటుకు మాత్రమే పరిమితమవుతారు. రెండు, మూడు చోట్ల ఓటరుగా నమోదు చేసుకోవడం కుదరదు.
కాగా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎప్పటికప్పుడు బోగస్ కార్డులు బటయపడుతూనే ఉన్నాయి.. మరోవైపు.. తమ ఓటు గల్లంతు అయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు.. ఎన్నికలకు వచ్చిన ప్రతీసారి ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిగా మారింది. జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగస్ కార్డులను ఈసీ నియంత్రించలేకపోతోంది. అయితే, బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఓటర్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు బోగస్ ఓట్లను సులభంగా తీసేయొచ్చనని పేర్కొంది. ఇక ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం వల్ల ఒక్కొక్కరికి ఒక్క ఓటు మాత్రమే పరిమితం అవుతుందని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఇవాళ లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటనను చూస్తే.. మొత్తంగా అటువైపే అడుగులు వేస్తోంది కేంద్రం.