Covid Pandemic : కరోనా కోరల్లో సెలబ్రిటీలు.. అసలేం జరుగుతోంది.?

Covid Pandemic : ‘మేం రెండు వ్యాక్సిన్లూ తీసుకున్నాం.. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం.. అయినా కోవిడ్ బారిన పడ్డాం..’ అంటూ పలువురు సెలబ్రిటీలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ‘మహానటి’ కీర్తి సురేష్ వరకు.. లిస్టు పెరుగుతూనే వుంది.

కోవిడ్ దెబ్బకి ‘కట్టప్ప’ సత్యరాజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తలు వచ్చాయి. అయితే, సత్యరాజ్ కోలుకున్నాడు. తన తండ్రి పూర్తిగా కోలుకున్నారనీ, ఇంటికి వచ్చేశారనీ సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మహేష్ బాబు ఓ వైపు కోవిడ్ కారణంగా ఐసోలేషన్‌లో వుంటే, మహేష్ సోదరుడు రమేష్‌బాబు కాలేయ సంబంధిత అనారోగ్యంతో కన్నుమూయడం బాధాకరం. తన సోదరుడ్ని కడసారి చూసేందుకూ మహేష్‌బాబు నోచుకోలేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.

మంచు మనోజ్, బండ్ల గణేష్.. ఇలా చెప్పుకుంటూ పోతే, గత కొద్ది రోజులుగా కోవిడ్ బారిన పడిన వారి లిస్టు చాలా చాలా పెద్దదే. అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిపోయింది. అయినా, వీళ్ళెందుకు కోవిడ్ బారిన పడుతున్నారు.? అవన్నీ ఒమిక్రాన్ కేసులేనా.? ఇలా చాలా అనుమానాలు వారి అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా వుంటే, కోవిడ్ కారణంగా సినిమాల షూటింగులు కూడా రద్దవుతున్నాయి. మొత్తంగా చూస్తే, సినీ పరిశ్రమ మీద మూడో వేవ్ కూడా తీవ్రంగానే ప్రభావం చూపుతోంది. అయితే, తీవ్రస్థాయి అనారోగ్యం కోవిడ్ ఒమిక్రాన్ వల్ల సంభవించడంలేదనే భావించొచ్చు. అదే సమయంలో వ్యాక్సినేషన్ కూడా కొంత మేలు చేస్తోంది.