ఆంధ్రపదేశ్ లో భాజాపా `కాపు` మిషన్ ని చేపట్టిందా? కాపులందర్నీ ఏకం చేసి జగన్ కి ఝలక్ ఇవ్వాలని చూస్తుందా? 2024 ఎన్నికలు టార్గెట్ గా బీజేపీ పెద్ద వ్యూహమే వేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది తాజా సన్నివేశాల్ని బట్టి చూస్తుంటే. ప్రస్తుతం ఏపీలో బలంగా ఉన్న ఒకే ఒక్క పార్టీ వైకాపా. ప్రతిపక్ష పార్టీ టీడీపీని జగన్ సర్కార్ అన్ని రకాలుగా అణగదొక్కాలని కంకణం కట్టుకుని పనిచేస్తోంది. పచ్చ నేతల అక్రమాల్ని బయటకి లాగి ఒక్కొక్కరిగా జైళ్లకు పంపిస్తోంది. 2024 ఎన్నికలు వచ్చే లోపు ఏపీలో సైకిల్ పార్టీ లేకుండా చేయాలని వైకాపా పావులు కదుపుతోంది. అయితే ఇదే అదునుగా భావించిన భారతీయ జనతా పార్టీ కూడా ఏపీలో జెండా పాతేయడానికి కలలమనాధులు పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది.
దీనిలో భాగంగా బీసీ సామాజిక వర్గం తర్వాత అధికంగా ఓటు బ్యాంక్ కలిగిన కాపు సామాజిక వర్గాన్ని బీజేపీ టార్గెట్ చేసి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆ తర్వాత ఆయన స్థానంలోకి వచ్చిన సోము వీర్రాజు అదే వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. సోము సారథిగా నియామకం అయిన వెంటనే కాపు సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే. శుక్రవారం వీరిద్దరి మధ్య రెండు గంటలకు పైగా భేటీ జరిగింది. ఇరువురి మధ్య కీలక రాజకీయ అంశాలు చర్చకొచ్చాయి. ఇది మర్యాద పూర్వక భేటీ కాదని..పక్కా పొలిటికల్ భేటీ అని తేలిపోయింది. 2024 లో బీజేపీ-జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చిరంజీవి అన్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఇక ఆవెంటనే సోము వీర్రాజు మిత్రపక్ష(జనసేన) అధినేత అయిన పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యచరణ ప్రధాన ఎజెండాగా చర్చ సాగినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంను బీజేపీ సారథి కలవనున్నట్లు ఢిల్లీ నుంచి లీకులందాయి. వీలైనంత త్వరంగా ముద్రగడతో వీర్రాజు భేటీ కానున్నారని సమాచారం. ఇప్పటికే ఢిల్లీ పెద్దల నుంచి ముద్రగడను పార్టీలో చేరమని ఫోన్ కాల్స్ వెళ్లినట్లు పొలిటికల్ కారిడార్ లో చర్చకొస్తుంది. ఇదే విషయంపై సోము వీర్రాజు కలిసినప్పుడు చర్చించనున్నారని సమాచారం. అవును ఈ ప్రచారాన్ని కొట్టి పారేయడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే చోటు చేసుకుంటున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. బీజేపీ సారథి వరుసగా కాపు నేతల్ని కలిసి ఓ తాటిపైకి తీసుకురావడం వెనుక బీజేపీ `కాపు` మిషన్ ని చేపట్టినట్లే కనిపిస్తోంది.