బిగ్ బాస్ తెలుగు 5, కేవలం పెద్దలకు మాత్రమేనా.?

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ అత్యంత జుగుప్సాకరంగా సాగుతోంది. తొలి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సరయు, ఇప్పటిదాకా జరిగిన బిగ్ బాస్ సీజన్లన్నింటిలోకీ వరస్ట్ అండ్ వల్గర్ కంటెంట్.. అనే పేరు తెచ్చుకుంది. ఎలిమినేషన్ అనంతరం ఇంటర్వ్యూలో (ఇది కూడా బిగ్ బాస్ నిర్వాహకులకు సంబంధించినదే), తోటి కంటెస్టెంట్స్ మీద చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో బిగ్ బాస్ వీక్షకులు షాక్ తినేయాల్సి వచ్చింది. ఇక, తాజా ఎపిసోడ్ విషయానికొస్తే, కంటెస్టెంట్ ఉమా దేవి నోటికి హద్దూ అదుపూ లేకుండా పోతోంది. తోటి కంటెస్టెంట్లు, ఉమా దేవి బూతుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘నేనిలాగే వుంటా.. నేనిలాగే మాట్లాడతా..’ అంటూ ఉమాదేవి విరుచుకుపడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్మోకింగ్ రూమ్‌లో ఫిమేల్ కంటెస్టెంట్స్ గుప్పు గుప్పున పొగ వదులుతున్న వైనం ఇప్పటికే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ఈ విషయాల్లో బిగ్ బాస్ ఎందుకు ‘కత్తెర పదును’ చూపించడంలేదు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న చాలామందికి. కానీ, వీటితోనే షో రేంజ్ పెరుగుతుందని బహుశా నిర్వాహకులు భావిస్తున్నారేమో అనేది మరో చర్చ. అదీ నిజమే అయి వుండొచ్చు. గతంతో పోల్చితే ఈసారి కంటెస్టెంట్స్ డీసెన్సీని పూర్తిగా పక్కన పడేస్తున్నారు. గత సీజన్లలోనూ ఒకరిద్దరు కంటెస్టెంట్లు పలు సందర్భాల్లో నోరు జారేసినా, ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్నారు.. పద్ధతిగానే మెలిగారు. కానీ, ఇక్కడ పరిస్థితి వేరు. జుగుప్స, అత్యంత జుగుప్స.. అన్నట్టు తయారైంది. ఇంట్లో ఇంకో మనిషితో కూర్చుని బిగ్ బాస్ చూడలేని దుస్థితి దాపురించింది. పిల్లల్ని అయితే పూర్తిగా బిగ్ బాస్ వీక్షణం నుంచి దూరం పెట్టాల్సిందేనేమో. నిర్వాహకులే చొరవ తీసుకుని, ‘ఈ షో పెద్దలకు మాత్రమే’ అని ప్రకటించేస్తే పోలా.?