ఆషాడంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లడానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలలో ఆషాడమాసం ఒకటి. ఆషాడ మాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్లయిన వధువులు తమ అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తారు. ఈ విధంగా పెళ్లయిన వధూవరులు ఒకే చోట ఉండకూడదని అలాగే కొత్తగా ఇంట్లోకి అడుగుపెట్టిన కోడలు నెలరోజుల పాటు పుట్టింటికి వెళ్లాలి అనే ఆచారం ఉంది.ఈ విధంగా కొత్తగా పెళ్లయిన కోడలు నెలరోజుల పాటు ఎందుకు అత్తవారింట్లో ఉండకూడదు ఎందుకు తనని పుట్టింటికి పంపిస్తారు అనే విషయానికి వస్తే..

సాధారణంగా పెళ్లిళ్లు మాఘమాసం జేష్ట మాసంలో అధికంగా జరుగుతాయి. అయితే అప్పుడే పెళ్లి అయ్యి ముక్కు మొహం తెలియని ఇంటికి వెళ్లడంతో అమ్మాయి ఆ ఇంటిలో ఎంతో అసౌకర్యంగా ఉంటుంది.అందుకే ఆషాడం పేరుతో వారిని ఒక నెలరోజుల పాటు పుట్టింటికి పంపించడం వల్ల అత్తా కోడల మధ్య సఖ్యత ఏర్పడి వారి మధ్య ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఉంటుందని భావించి పెద్దవాళ్ళు ఆషాడంలో కొత్తగా పెళ్లయిన వధువును పుట్టింటికి పంపించేవారు.

ఇకపోతే ఆషాడ మాసంలోనే తొలకరి చినుకులు పడతాయి. రైతులందరూ కూడా వ్యవసాయ పనులలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లయిన వరుడు తన భార్య ఇంట్లో ఉంటే తను తన భార్య మీద వ్యామోహంతో వ్యవసాయ పనులను పక్కన పెడతారు. అందుకోసమే కొత్తగా పెళ్లయిన వధువును నెలరోజుల పాటు పుట్టింటికి పంపే ఆచారం కూడా ఉందని పెద్దలు చెబుతుంటారు.అందుకే కొత్తగా పెళ్లయిన వధూవరులను ఒక నెల రోజులపాటు దూరం పెడతారు.