పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ మీద ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టికెట్ ధరలు పెంచకూడదని, అదనపు షోలు వేయకూడదని నిబంధనలు పెట్టింది. వీటిని ఉల్లంఘించిన థియేటర్ల మీద చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. అయితే వీటికి సంబంధించిన జీవోను రాత్రికి రాత్రి జారీ చేయడమే చిత్రమైన విషయం. లాక్ డౌన్ తర్వాత వస్తున్న హెవీ బడ్జెట్ సినిమా. అందునా డిస్ట్రిబ్యూటర్లు అధిక ధరలు చెల్లించి హక్కులు కొన్నారు. అందుకే మొదటి మూడు రోజుల్లో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని, ఆదనపు షోలకు అనుమతులు కావాలని అధికారులను కోరారు.
మొదట్లో సానుకూలంగానే స్పందించిన అధికారులు చివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. లాక్ డౌన్ తర్వాత వచ్చిన ఉప్పెన, చెక్, రంగ్ దే, శ్రీకారం సినిమాలకు మాత్రం టికెట్ హైక్ ఇచ్చారు. పవన్ సినిమా విషయంలోనే నిరాకరించారు. దీంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహానికి లోనవుతున్నారు. కేవలం రాజకీయ కారణాల వలనే ఇలా అనుమతులు ఇవ్వకుండా ఆపారని, పెద్ద సినిమా రిలీజ్ సమయంలో టికెట్ హైక్స్, ఎక్స్ట్రా షోలు మామూలే కదా అని అంటున్నారు. ఇదే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమానో లేకపోతే వేరే ఏదైనా పెద్ద సినిమానో అయి ఉంటే అనుమతులు ఇవ్వకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు.