Ante Sundaraniki Movie Review : ‘అంటే…సుందరానికీ’ మూవీ రివ్యూ…

ante sundaraniki movie review

Ante Sundaraniki Movie Review :

చిత్రం : అంటే…సుందరానికీ

రచన-దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

విడుదల తేది : 10 జూన్ 2022

రేటింగ్ : 3/5

నటీనటులు : నాని, నజ్రియా నజీమ్‌, నరేశ్‌ హర్షవర్థన్‌, నదియా, రోహిణి , అజగం పెరుమాల్, నిక్కీ తంబోలీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తదితరులు

నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్‌

నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై.

దర్శకత్వం : వివేక్‌ ఆత్రేయ

సంగీతం : వివేక్‌ సాగర్‌

సినిమాటోగ్రఫీ : నికేత్‌ బొమ్మి

ఎడిటింగ్ : రవితేజ గిరిజాల,

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘అంటే… సుందరానికీ’ పై  విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.  ‘ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్’ అంటూ జోరుగా ప్రచారం చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మళ్లీ విజయాల బాటపట్టాడు  నాని. ఆ సినిమా సాధించిన విజయంతో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేయడం నానికి మొదట్నుంచి బాగా అలవాటు. సినిమా సినిమాకి తన పాత్ర, కథలో వేరియేషన్‌ ఉండేలా చూసుకుంటాడు. వరసగా యాక్షన్‌ డ్రామా చిత్రాలు చేస్తూ వచ్చిన నాని.. ఈ సారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో ‘అంటే.. సుందరానికీ’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.

మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ టాలీవుడ్‌కు పరిచయమయిన ఈ చిత్రం శుక్రవారం (జూన్ 10, 2022)న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో విడుదలయింది. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో  తెలుసుకుందాం…

కథలోకి వెళితే…

సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు సుందర్‌ (నాని). అతని తండ్రి (నరేశ్‌) కుటుంబ ఆచార వ్యవహారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్‌ని కూడా తనలాగే ఎంతో పద్దతిగా పెంచాలనుకుంటాడు.  సుందర్‌ కు చిన్నవయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతకంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగారావు (శ్రీకాంత్‌ అయ్యంగార్‌)ని సంప్రదిస్తుంది అతని కుటుంబం.

అప్పటి నుంచి సుందర్‌ జీవితమే పూర్తిగా మారిపోతుంది. ఈ దోషం, ఆ దోషం అంటూ జోగారావు డబ్బు కోసం సుందర్‌తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్‌కి విసుగెత్తి ఇంట్లో అబద్దాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్‌ కుటుంబానికి చెందిన యువతి లీలా థామస్‌(నజ్రియా నజీమ్‌) ఫ్యామిలీకి కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి(అలగం పెరుమాల్‌) హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు.

అలాంటి కుటుంబానికి చెందిన సుందర్‌, లీలాలు..ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్దాలు ఆడతారు. ఆ అబద్దాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలానికి దారి తీశాయి? సుందర్‌, లీలాలు చెప్పిన అబద్దాలు ఏంటి? ఇతర మతస్థులతో స్నేహం అంటేనే మండిపడే సుందర్‌, లీలాల కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

సినిమా ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగుతుంటుంది. సుందర్ పాత్రను ప్రారంభం నుంచి అమాయకంగా చూపించిన దర్శకుడు వివేక్…ఆ పాత్ర ప్రవర్తనకు నేపథ్యం చూపిస్తూ నవ్వించాడు. ప్రేమ కోసం సుందర్ తన చుట్టూ ఉన్న పాత్రలను ఉపయోగించుకోవడం, అందుకు అతను చెప్పే అబద్ధాలు వినోదాన్ని పండించాయి. దీనికి తోడు ఇంట్లో సంప్రదాయాల చాదస్తంతో అతను పడే ఇబ్బందులూ హ్యూమర్ క్రియేట్ చేశాయి.

పద్దతులు ఆచారాల ముసుగులో లోపలి మనిషిని చంపుకోవద్దు. మతం కంటే మానవత్వం గొప్పదనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతూ ఓ అందమైన ప్రేమకథని అంతే అందంగా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం జరిగింది ఈ చిత్రంలో. ఇలాంటి కథానేపథ్యం ఉన్న చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి.

వేరు వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం.. వాళ్లని ఎదిరించి, అష్టకష్టాలు పడి వారు పెళ్లి పీటలెక్కడం.. ఇలా మనం ఎన్ని చూసిఉండం. ‘అంటే సుందరానికీ’ సినిమా కథ కూడా  ఇలానే సాగుతుంది.

అయితే రొటీన్ కథకు కొత్త ట్రీట్‌మెంట్‌ ఇచ్చి, కాస్త కామెడీని పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. ఎలాంటి అశ్లీలతకు తావివ్వకుండా.. పూర్తి ఎంటర్‌టైనర్‌గా సినిమాను  మలిచినప్పటికీ అక్కడక్కడ కొంత సాగదీసినట్టు కనిపిస్తుంది. ప్రథమార్థంలో  సుందర్‌ బాల్యంలో వచ్చే ఒకటి రెండు సన్నివేశాలు  తప్ప.. మిగతావేవి అంతగా ఫన్‌ని క్రియేట్‌ చేయలేదు.

హీరోయిన్‌ని పరిచయం చేయడానికి దర్శకుడికి చాలా సమయం పట్టింది. . దీనికి తోడు హీరో కంటే ముందే ఆమెకు మరో ప్రేమకథని యాడ్‌ చేయడంతో  ఫస్టాఫ్‌  కొంత నిరాశకు గురిచేస్తుంది. ద్వితీయార్ధంలోనే అసలు కథ మొదలవుతుంది. సుందర్‌, లీలా ఇద్దరు అమెరికాకు వెళ్లడం.. పెళ్లి కోసం అబద్దం చెప్పి ఇండియాకు రావడంతో అసలు కథ ముందుకు సాగుతుంది. వీరిద్దరు చెప్పిన అబద్దాలే నిజంగా జరగడంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ మొదలవుతుంది.

నటీనటుల విషయానికొస్తే…

సుందర్‌ ప్రసాద్‌ పాత్రలో నాని పూర్తిగా  ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. యాక్షన్‌ అయినా.. కామెడీ అయినా తనదైన నటనతో మెప్పిస్తాడు. ఈ చిత్రంలోకూడా అదే జరిగింది. తనదైన కామెడీతో నవ్వించాడు. తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయిన నజ్రియా నజీమ్ లీలా థామస్‌గా చక్కటి నటనను కనబరిచింది.  తెలుగులో ఇది ఆమెకు తొలి సినిమాయే అయినా. బాగా నటించింది. ప్రేక్షకుల్ని మెప్పించింది. పైగా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం గొప్ప విశేషం.

సుందర్‌ తండ్రిగా నరేశ్‌ మరోసారి విజృంభించి తనదైన శైలిలో పాత్రని రక్తి కట్టించాడు. ఇక రోహిణి విషయానికొస్తే..  సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా, భర్త మాటకు ఎదురు చెప్పలేని భార్యగా తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. హీరోయిన్‌ తల్లిగా నదియ, తండ్రిగా అలగం పెరుమాల్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సుందర్‌ సహోద్యోగి సౌమ్య పాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ కనిపిస్తుంది. సుందర్‌ బాస్‌గా హర్షవర్ధన్‌ తనదైన కామెడీతో నవ్వుల్నీ కురిపించాడు.

టెక్నికల్ విషయాల కొస్తే…

వివేక్‌ సాగర్‌ సంగీతం  భేష్.. అనిపిస్తుంది. పాటలు ఓకే అనిపించేలా సాగినా… నేపథ్య సంగీతం మాత్రం కొత్తగా  ఉంది. నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ సూపర్. ప్రతీ ఫ్రెమ్ ని ఎంతో అందంగా తన కెమెరాలో బంధించాడు.  రవితేజ గిరిజాల ఎడిటింగ్ ఫర్వాలేదు.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాని ఎంతో రిచ్ గా తెరకెక్కించారు.

సినిమా ప్రారంభమే తన చిన్నతనం మెమోరీస్ తో ప్రారంభం అవుతుంది. టైటిల్ కార్డ్స్ పడగానే.. నాని ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఒక తండ్రి, కొడుకు మధ్య ఉండే బంధాన్ని సినిమాలో బాగా చూపించారు.  మొత్తానికి సినిమా మాత్రం ఫుల్ టు ఫన్, ఎంటర్ టైన్ మెంట్ గా నడుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం ఒక ఫన్ రైడ్ గా ఉంటుంది.

-ఎం.డి అబ్దుల్