కొన్ని దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులని అలరిస్తున్న లెజండరీ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలకు మన దేశంలోనే కాదు విదేశాలలోను ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఏడుపదుల వయస్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వెళుతున్న రజనీకాంత్ ఇటీవల తన 168వ చిత్రం అన్నాత్తె షూటింగ్లో పాల్గొన్నాడు. షూటింగ్ కొద్ది రోజులు జరిగిన తర్వాత చిత్ర బృందంలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్‌కు బ్రేక్ వేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకు రజనీకాంత్ హై బీపీతో అపోలో ఆసుపత్రిలో చేరారు.
డిసెంబర్ 31న రజనీకాంత్ తన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తాడని అందరు ఎదురు చూస్తున్న సమయంలో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. అనారోగ్యం వలన రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. అభిమానులు నిరసనలు, ర్యాలీలు చేసిన రాజకీయాలలోకి వచ్చే సమస్యే లేదని చెప్పారు. మరోవైపు రజనీకాంత్ సినిమాలు చేయడని, ఆయన నటిస్తున్న అన్నాత్తె షూటింగ్ కూడా ఆపేస్తారంటూ పుకార్లు షికారు చేశాయి. కాని తాజాగా అన్నాత్తెను నవంబర్ 4న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించడంతో తలైవా అభిమానులలో ఆనందం వెల్లివిరిసింది.
ప్రస్తుత పరిస్థితులలో రజనీకాంత్ ఏ మాత్రం స్ట్రెస్ తీసుకునేట్లుగా కనిపించడం లేదు. అన్నాత్తె చిత్ర షూటింగ్‌ను ఎలాగోలా పూర్తి చేసి కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని రజనీకాంత్ నిర్ణయంగా తెలుస్తుంది. అన్నాత్తె చిత్రం శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుండగా, ఇందులో రజనీకి జోడీగా నయనతార నటిస్తున్నారు. అలాగే కీర్తీ సురేశ్, మీనా, కుష్భూ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు . ఇందులో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. గతేడాది సమ్మర్లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేయగా, అప్పుడు బాలుతో ఓ పాట పాడించారు. అతి త్వరలోనే ఈ సాంగ్ విడుదల చేయాలని అనుకుంటున్నారు.