పటాస్ సినిమా ద్వారా డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు అనిల్ రావిపూడి. మొదటి సినిమా నుంచి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిల్ రావిపూడి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి పరాజయం లేకుండా ఇండస్ట్రీలో ఎంతో విజయవంతమైన దర్శకుడిగా కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా ఈయన విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్ 3 ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే తన తదుపరి ప్రాజెక్టు నందమూరి నటసింహం బాలకృష్ణతో ప్రకటించారు.
ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా అనిల్ రావిపూడి తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టమని అదే ఇష్టం తనతో పాటే పెరుగుతూ వచ్చిందని, అందుకే బీటెక్ పూర్తి కాగానే తన బాబాయ్ అరుణ్ ప్రసాద్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల తాను కూడా ఇండస్ట్రీ వైపు వచ్చానని అనిల్ రావిపూడి వెల్లడించారు.
ఇక ఇండస్ట్రీలో తన ప్రయాణం అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై అనంతరం రచయితగా ప్రస్తుతం డైరెక్టర్ గా కొనసాగుతున్నానని తెలిపారు.ఒకవేళ తాను డైరెక్షన్ మానేస్తే తప్పకుండా ఆర్టిస్ట్ అవుతానని తనకు నటనంటే కూడా ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తెలిపారు. ఇకపోతే తనకు కెరియర్ మొదట్లో చాలీచాలని జీతం వచ్చేదని,అయితే హైదరాబాద్లో తన అక్క పెదనాన్న వాళ్ళు ఉండటం వల్ల తనకు డబ్బుకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదని తెలిపారు. ఇక తన బాబాయి అరుణ్ ప్రసాద్ ఇండస్ట్రీలో తనకు దిశానిర్థేశాలు చేశారని తన సినీ కెరీర్ కు తన బాబాయ్ గాడ్ ఫాదర్ అని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన కెరీర్ గురించి తెలియజేశారు.