మీకు వినోదం పంచేందుకు మా క‌ష్టాలు ఎలా ఉంటాయో చూడండి అంటూ వీడియో షేర్ చేసిన ర‌వి

రంగుల ప్ర‌పంచం ఎప్పుడు మ‌న‌కు క‌ళక‌ళ‌లాడుతూనే క‌నిపిస్తుంది. కాని దాని వెనుక వారు ప‌డే క‌ష్టాలు తెలిస్తే మాత్రం అవాక్క‌వ్వ‌డం ఖాయం. షూటింగ్స్‌కు ప‌ర్టిక్యుల‌ర్ టైం అంటూ ఉండ‌దు. తిండితిప్పలు, నిద్రాహారాలు మాని మ‌రి షూటింగ్స్ చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. ఇలాంటి సంద‌ర్భంలో కొంద‌రు క‌ళ్లు తిరిగి ప‌డ‌డం, అనారోగ్యానికి గుర‌వ్వ‌డం కూడా జ‌రుగుతుంది. రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్ షూటింగ్ వ‌ల‌న కాస్త అల‌సిపోయి హైబీపీతో ఆసుప‌త్రిలో చేరారు. ఆ మ‌ధ్య అన‌సూయ కళ్ళు తిరిగి ప‌డింది. ఇలాంటివి కోకొల్ల‌లు. మ‌న‌కు వినోదం అందించేందుకు స్టార్స్ ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నార‌ని యాంక‌ర్ రవి చిన్న వీడియో ద్వారా తెలియ‌జేశారు.

బుల్లితెర కార్య‌క్ర‌మాలు దాదాపు ప్ర‌తి రోజు ప్ర‌సారం అవుతుంటాయి. ఇందుకోసం వారు ఒక్కోసారి నాన్‌స్టాప్ షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదే విష‌యాన్ని యాంక‌ర్ ర‌వి తెలియ‌జేస్తూ.. ఇప్పుడు స‌మ‌యం ఉద‌యం గం.4.37ని.లు. ఉద‌యం 8 గంట‌ల‌కు మొద‌లైన షూటింగ్ ఇప్పటికీ కొన‌సాగుతోంది. మీరు మా మీద చూపించే ప్రేమతో దీన్ని పోల్చ‌లేము అని కామెంట్ పెట్టారు. అంతేకాదు షూటింగ్ ప‌రిస్థితుల‌ని కూడా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

వీడియోలో ఒక‌వైపు ఆర్ట్ డైరెక్ట‌ర్స్ సెట్ కు సంబంధించిన ప‌నులు చేస్తుండ‌గా, కెమెరా మెన్స్ షూట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. మ‌రోవైపు ర‌వికి కో యాంక‌ర్ అయిన విష్ణు ప్రియ నిద్ర ఆపులోక కొద్ది సేపు ప‌డుకుంది. ఇక ప‌క్క‌న ఉన్న సీరియ‌ల్ న‌టులు సుహాసిని, న‌వ్య స్వామి, ర‌వికృష్ణ‌, అర్జున్ త‌దిత‌రులు మాట్లాడుకుంటూ క‌నిపించారు. ఇది చూసిన నెటిజ‌న్స్ అమ్మో సీరియ‌ల్ వాళ్ల క‌ష్టాలు ఇంత దారుణంగా ఉంటాయా అని వాళ్ల‌ల్లో వాళ్లే అనుకుంటున్నారు. మీకు వినోదం అందించేందుకు మేము ఇంత క‌ష్ట‌ప‌డుతుంటే కొంద‌రేమో ఏం బాగుందంటూ సింపుల్‌గా తీసేస్తారు అని యాంక‌ర్ ర‌వి త‌న ఆవేద‌న వెళ్ల‌బుచ్చాడు.