అల్లు అర్జున్ సైన్ చేసిన ‘ఐకాన్’ చిత్రం మీద ఇప్పటికీ ఒక క్లారిటీ అనేది లేదు. కాసేపు సినిమా ఉంటుందని, ఇంకాసేపు కథ మారుస్తున్నారని, ఇంకాసేపు దిల్ రాజు నిర్మాణం నుండి తప్పుకున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అన్ని వార్తలు ఎలా ఉన్నా సినిమా పట్టాలెక్కుతుందని, దర్శకుడు వేణు శ్రీరామ్ అనేది మాత్రం ఖాయం.
నిజానికి ఇది దిల్ రాజు ప్రాజెక్ట్. ఆయన సమక్షంలోనే కథను రాసుకున్నారు వేణు శ్రీరామ్. ఈ చిత్రం మీద పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టడానికి ముందుకొచ్చారు దిల్ రాజు. కానీ ఈమధ్య ఆయన మనసు మారిందట. సినిమాను చేయాలా వద్దా, అంత డబ్బు పెట్టడం అవసరమా అనే ఆలోచనలో పడ్డారట. పైగా ఆయన పలు పాన్ ఇండియా సినిమాలు నిర్మించడానికి సిద్దమవుతున్నారు.
ఈ కన్ఫ్యూజన్ సమయంలోనే నిర్మాత అల్లు అరవింద్ ట్రబుల్ షూటర్ తరహాలో రంగంలోకి దిగారట. ‘ఐకాన్’ నిర్మాణంలో తాను కూడ పాలుపంచుకోవాలని అనుకుంటున్నారట ఆయన. దీంతో దిల్ రాజు సైతం రిలాక్స్ ఫీలయ్యారట. అల్లు అరవింద్ ఎంటర్ అయ్యారు అంటే లాభాలే తప్ప నష్టాల ప్రస్తావన ఉండదు.
సొంతగా రిలీజ్ చేస్తే ఏదైనా రిస్క్ ఉండవచ్చేమో కానీ పూర్తిగా అమ్మేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పైగా గీతా ఆర్ట్స్, దిల్ రాజు బ్యానర్ సంయుక్త నిర్మాణం అంటే బిజినెస్ వర్గాల్లో డిమాండ్ ఇంకా పెరుగుతుంది కూడ. సో.. అల్లు అరవింద్ జోక్యంతో ‘ఐకాన్’ గొడవ ఒక కొలిక్కి వచ్చినట్టే అనుకోవాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని ‘పుష్ప-1’ ముగిసిన వెంటనే పట్టాలెక్కించనున్నారు.