Nayanthara :  ‘రా రమ్మని.. రా రా రమ్మని నయనతారను  పిలవాలి ఈ వేళ..’ ఇదేం పాట కాదులెండి. సౌత్ క్వీన్ నయనతార మంచి నటి అన్న సంగతి తెలిసిందే. అయితే, తెరపైనే ఆమె ప్రతాపం చూపిస్తుంది. షూటింగ్ వరకే డేట్లు కేటాయిస్తుంది.
ఆ తర్వాత జరిగే సినిమా ప్రమోషన్లలో అస్సలు పాల్గొనదు. గతంలో నయనతార నటించిన చాలా సినిమాల విషయంలో ఇదే చర్చ నడిచింది. ఎంతటి స్టార్ హీరోల సినిమా అయినా కానివ్వండి.. ప్రమోషన్లలో నయనతారను తీసుకురావడం ఎవ్వరి వల్లా కాదు.
అందులోనూ టాలీవుడ్ ప్రమోషన్లలో అస్సలు కనిపించదు నయనతార. అది మెగాస్టార్ సినిమా కానీ, విక్టరీ వెంకటేష్ సినిమా కానీ. ఇక ఇప్పుడు నయనతార నటించిన ‘కేఆర్‌కే’ సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది.
విజయ్ సేతుపతి, సమంత, నయనతార ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. విజయ్ సేతుపతి సినిమాలకు ఈ మధ్య తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగులో కూడా సినిమాలు చేయడమే అందుకు కారణం కావచ్చు.
అలాగే సమంతకు టాలీవుడ్‌లో వున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. కాగా, ‘కెఆర్‌కె’ సినిమాకి సంబంధించి తెలుగులో భారీ ఎత్తున ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారట. అయితే, నయనతారను ఆ ప్రమోషన్లలో భాగం చేయడమెలా.? అన్నదానిపై కాస్త గట్టిగానే రచ్చ నడుస్తోందట.
వస్తే, గిస్తే తమిళ ప్రమోషన్లకు నయన్ వస్తుందేమో కానీ, తెలుగులో ఛాన్సే లేదంటున్నారు. ఈ రచ్చ తెలుసుకున్న నయన్, ఎందుకొచ్చిన గొడవలే  అనుకుందేమో.. ఇక్కడా, అక్కడా కాదు, మొత్తానికి ఏ ప్రమోషన్‌కీ వెళ్లకూడదని అనుకుంటున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.