Ajith Valimai : ‘వాలిమై’ ప్రేత్యేకత లేమిటో?

Ajith Valimai : హై వోల్టేజ్ యాక్షన్ ‘వాలిమై’ తో అజిత్ తన పానిండియా ఎంట్రీగా ఇటు సౌత్ లో, అటు నార్త్ లో రెండు బిగ్ మూవీస్ ని ఢీ కొనడం ఆసక్తిగా మారింది. సౌత్ లో పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’, నార్త్ లో సంజయ్ లీలా భంసాలీ – ఆలియా భట్ లతో ‘గంగూ బాయి ఖటియావాడీ’ తోనూ తలపడేందుకు సై అంటూ రంగంలోకి దూకేశాడు. అయితే ఇది రిస్కుగా ఏమాత్రం భావించడం లేదు. అయితే నిర్మాత బోనీ కపూర్ ‘వాలిమై’ సీక్వెల్ కూడా వుంటుందని చెబుతూ, ‘వాలిమై’ రిజల్ట్ చూశాక నిర్ణయిస్తామన్నాడు.

అందుతున్న సమాచారం మేరకు ‘వాలిమై’ కి ‘భీమ్లా నాయక్’, ‘గంగూ బాయీ’ లతో వచ్చే ముప్పేమీ లేదు. తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో ‘వాలిమై’ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా వుంటుంది. కథ వినూత్నమైనది. ఇది ఒక పోలీసు అధికారి అర్జున్ (అజిత్) చుట్టూ తిరుగుతుంది, స్త్రీల మీద క్రూరమైన నేరాలకు పాల్పడే చట్టవిరుద్ధమైన బైకర్ల సమూహాన్ని ట్రాక్ చేసి అంతమొందించే కథతో ‘వాలిమై’ భిన్నంగా వుంటుంది.

హెచ్. వినోద్ రచన, దర్శకత్వం చేసిన ‘వాలిమై’ ఇంకో ప్రత్యేకతని కూడా కలిగివుంది. ఆరో 11.1 సరౌండ్ సౌండ్ టెక్నాలజీలో – ప్రత్యేకమైన థియేట్రికల్ వీక్షణానుభూతిని అందించడానికి సౌండ్ మిక్సింగ్ చేశారు. దీనికోసం థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ సౌండ్ సిస్టమ్ 2013 లో కమలహాసన్ ‘విశ్వరూపం’ తర్వాత వాలిమై లోనే వినియోగించారు.

చెన్నై, హైదరాబాద్ లలో షూటింగ్ పూర్తి చేసి, రష్యాలో క్లయిమాక్స్ దృశ్యాలు చిత్రీకరించిన ప్రత్యేకత కూడా వుంది. ఇంకా అజిత్ పాత్రకి కూడా ఓ ప్రత్యేకత వుంది. అజిత్ పాత్రకి నిజ జీవితంలో రేసర్‌గా మారిన ఓ పోలీస్ ఆఫీసర్‌ ని స్ఫూర్తిగా తీసుకున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బైక్ రేసర్‌ ని నేరుగా ఎస్‌ఐగా నియమించారు. మాజీ రేసింగ్ ప్రొఫెషనల్‌గా మారిన ఈ నిజజీవిత పోలీస్ అధికారిని అజిత్ పాత్రకి స్ఫూర్తిగా తీసుకుని రూపకల్పన చేశారు.

మోటార్ సైకిల్ గ్యాంగ్ ని జర్మనీలోని ఒక గ్యాంగ్ ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ గ్యాంగ్ ఉత్తర అమెరికా, స్కాట్ లాండ్, ఆస్ట్రేలియాలకు కూడా వ్యాపించి వివిధ నేరాలతో గడగడ లాడించారు.

ఈ మూవీలో తెలుగు హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ గా నటించడం ఇంకో ప్రత్యేకత. ఇతడితో బాటు ఇంకో ఇద్దర్లు విలాన్స్ ని అజిత్ ఎదుర్కొంటాడు. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి హీరోయిన్ గా నటించడం కూడా ప్రత్యేకత. అయితే ఈమె అజిత్ కి ఫ్రెండ్ గా వుంటుందేతప్ప రోమాన్స్ వుండదని అంటున్నారు.

మోటార్ బైక్స్ తో ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాకి గిబ్రాన్, యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విజయ్ వేలుకుట్టి. ఈనెల 24 న తెలుగులో ఇదే టైటిల్ తో విడుదలవుతున్న ఈ అజిత్ రేసింగ్ అద్వెంచర్ తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుందని చెప్పొచ్చు.

***