పెంపుడు కుక్కల రాజకీయమా.? ఇదెక్కడి చోద్యం.!

సినీ నటుడు పృధ్వి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు. అందుకే ఆయనకు ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ పదవి దక్కింది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆయన వెంట పలు సందర్భాల్లో పృధ్వీ కనిపించారు. వైసీపీ ప్రత్యర్థి పార్టీల మీదా, ఆయా పార్టీల నేతల మీదా పృధ్వీ విరుచుకుపడిన తీరు అప్పట్లో సంచలనం. అయితే, ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా పనిచేస్తున్న సమయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పృధ్వీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పట్లో వైసీపీకి ఆయన దూరమవుతాడనే ప్రచారం జరిగింది. పృధ్వీ కూడా రాజకీయాలకు కాస్త దూరంగా వున్నట్లే కనిపించారు. కానీ, ఇప్పుడాయన మళ్ళీ రాజకీయాల్లో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీరుపై మండిపడ్డారు పృధ్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో. వైసీపీలో వుంటూ, వైసీపీ విధానాల్ని ప్రశ్నించే బదులు.. వైసీపీకి రాజీనామా చేసెయ్యొచ్చు కదా.?

అన్నది రఘురామకు పృధ్వీ ఇచ్చిన సలహా. అంతే కాదు, నర్సాపురంలో వైఎస్ జగన్ పోటీ చేసినా గెలుపు తనదేనని రఘురామ వ్యాఖ్యానించడాన్నీ పృధ్వీ తప్పు పట్టారు. రఘురామను ఓడించడానికి వైఎస్ జగన్ వరకూ ఎందుకు.? వైఎస్ జగన్ పెంపుడు కుక్కల్లాంటి తనలాంటివారు సరిపోతారని పృధ్వీ అభిప్రాయపడ్డారు. నిజానికి, రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. కానీ, తరచూ అధినేత మెప్పు కోసం వైసీపీ నేతలు తమ స్థాయిని మర్చిపోతున్నారు. తద్వారా వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్నది నిర్వివాదాంశం. ‘ముఖ్యమంత్రికి చిడతలు వాయిస్తాం.. మాకు ఆయనంటే భక్తి, గౌరవం..’ అని ఓ మంత్రి ఆ మధ్య చేసిన వ్యాఖ్యలూ ఇలాగే వివాదాస్పదమయ్యాయి. టీడీపీ అధికారంలో వున్నప్పుడూ కొందరు టీడీపీ నేతలు ఇలాగే చంద్రబాబుని ప్రసన్నం చేసుకునేందుకు దిగజారుడు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.