టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనం రోడ్డు ప్రమాదానికి గురయింది. సడెన్ గా ఆవు అడ్డురావడంతో… వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో… కాన్వాయ్ లోని జామర్ వెహికల్ ను ఎన్ఎస్జీ2 వాహనం ఢీకొన్నది.
దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. దాని వెనుక వాహనంలోనే చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే.. చంద్రబాబుకు ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జామర్ వాహనాన్ని ఢీకొనడంతో… వాహనం మొరాయించింది. దీంతో పావుగంట పాటు చంద్రబాబు నాయుడు రోడ్డు మీదనే ఉండాల్సి వచ్చింది.
వెంటనే స్పేర్ వాహనంలో ఎన్ ఎస్ జీ సిబ్బంది ఎక్కగానే చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్నది.
చంద్రబాబు నాయుడు ఇటీవలే విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయి.. కాన్వాయ్ లో వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిసింది.