Crime News: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వ్యక్తి.. పెరిదేపిలో ఉద్రిక్త వాతావరణం..!

Crime News: పెరిదేపి కి చెందిన రామబ్రహ్మం (45) అనే వ్యక్తి గ్రామ వారం క్రితం గ్రామ శివారులోని వాగులో గాయాలతో పడి ఉన్నాడు. ఈ క్రమంలో గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే రామబ్రహ్మం చనిపోవడానికి గ్రామం లోని బీసీ కాలనీ కి చెందిన కొందరు వ్యక్తులు కొట్టడం కారణమని రామబ్రహ్మం భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెరిదేపిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది .

వివరాల్లోకి వెళితే… మర్రిపూడి మండలం అయ్యావారి పాలెం గ్రామానికి చెందిన రామబ్రహ్మం పెరిదేపి కి చెందినధనలక్ష్మి అనే మహిళను వివాహం చేసుకొని అక్కడికే వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గ్రామంలో బిసి, ఎస్సీ కాలనీలు పక్కపక్కనే ఉంటాయి. ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రామబ్రహ్మం ఈనెల 1వ తేదీన బి.సి.కాలనీ పరిసరప్రాంతాలలో తిరుగుతుండగా అక్కడి స్థానికులు అతని భార్యను పిలిపించి ఇంటికి తీసుకెళ్లామని చెప్పారు.

అయితే రామబ్రహ్మం భార్య ఇంటికి రమ్మని బతిమాలినా కూడా రామబ్రహ్మం వినకుండా ఇంటికి వెళ్లడానికి తిరస్కరించాడు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి రామబ్రహ్మం గ్రామ శివారులోని వాగులో గాయాలతో పడివున్నాడు.అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రామబ్రహ్మం ఒంగోలులోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న సమయంలో రామబ్రహ్మం పరిస్థితి విషమంగా మారి చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో రామబ్రహ్మం భార్య బీసీ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు తన భర్త ని కొట్టడం వల్లనే తన భర్త చనిపోయాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం రామబ్రహ్మం మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి పెరిదేపి కి తీసుకువచ్చి రోడ్డు మీద గంట సమయం పాటు రాస్తారోకో చేశారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడిఈ దారుణానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని వారికి హామీ ఇవ్వడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు రాస్తారోకో విరమించుకున్నారు.