నాని అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో. ఈయన మీద జాగ్రత్తగా బడ్జెట్ పెడితే లాభాలు ఖాయం అనే మాట ఉండేది. నానికి అంటూ ఒక స్థిరమైన మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ స్థాయిని అనుకరించే పెట్టేవారు. కొన్ని సినిమాల బడ్జెట్ ఈ స్థాయిని దాటిపోవడంతో నష్టాలు చూసిన సందర్భాలు కూడ ఉన్నాయి. అయితే నాని కొత్త చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ విషయంలో మాత్రం ఈ లెక్కలేవీ చూసుకోవట్లేదు నిర్మాతలు. విచ్చలవిడిగా డబ్బులు కుమ్మరిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నాని డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అందులో ఒక పాత్ర పేరు సింగరాయ్.
కలకత్తా నేపథ్యంలో ఈ పాత్ర ఉంటుంది. పిరియాడికల్ నేపథ్యంలో ఈ పాత్ర కథ ఉంటుంది. చాలావరకు ఓల్డ్ కలకత్తా సెటప్లో ఉంటుంది. నిన్న మొన్నటి వరకు కలకత్తాలోని పలు లొకేషన్లలో షూటింగ్ చేసిన టీమ్ కోవిడ్ సెకండ్ వేవ్ రీత్యా వెనక్కు తిరిగొచ్చారు. హైదరాబాద్ శివార్లలోనే ఓల్డ్ కలకత్తా నగరాన్ని సెట్స్ ద్వారా రీక్రియేట్ చేశారు. ఈ సెట్స్ వేయడానికి రూ.6.5 కోట్లు ఖర్చయిందట. రెండు వారాలు ఇందులో షూటింగ్ జరపనున్నారు. ఆరున్నర కోట్ల సెట్ అంటే బడా హీరోల రేంజ్. కానీ నాని సినిమా కోసం అది కూడ సింగిల్ షెడ్యూల్ కోసం ఇంత వెచ్చించారు.
మరి ఒక్క సెట్ కోసమే ఇంత పెడుతున్నారు అంటే సినిమా బడ్జెట్ ఇంకెంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇది ఒకరకంగా రిస్క్ అనే అనాలి. ఇంత భారీ మొత్తం వెనక్కు రావాలి అంటే సినిమా భారీ విజయాన్ని సాధించాలి. అప్పటికీ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. చూడాలి మరి ‘శ్యామ్ సింగరాయ్;’ నిర్మాతను ఏ తీరాలకు చేరుస్తాడో.