సినీ పరిశ్రమకు, రాజకీయాలకు లింక్ పెట్టాలనే దురుద్దేశం ఎప్పుడు ఎవరికి వచ్చినా లేవనెత్తే పేరు చిరంజీవి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పనిగట్టుకుని ఆయన మీద కుల ముద్ర వేసిన ఒక కుల వర్గం ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తూ నవ్వులపాలవుతోంది. లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ కుదేలయ్యింది. ఒక పెద్దగా బాద్యత తీసుకున్న చిరంజీవి మిగతా సినీ పెద్దల్ని కలుపుకుని అటు కేసీఆర్, ఇటు జగన్ ఇద్దరినీ కలిసి షూటింగ్లకు అనుమతి తీసుకొచ్చారు. ఆయనే గనుక పూనుకుని ఉండకపోతే పరిశ్రమ పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉండేది.
ఆ విషయంలో ఆయన్ను మెచ్చుకోకపోగా రాజకీయాల పేరుతో బురద చల్లే ప్రయత్నం చేస్తోంది ఒక వర్గం. ఆ వర్గానికి చెందిన మీడియా ఛానెళ్ళు అయితే ప్రత్యేకించి చిరు మీద డిబేట్లు పెట్టి నానా యాగీ చేస్తున్నారు. చిరు ఇతర సినీ పెద్దలతో కలిసి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లినప్పుడు అమవరావతి రైతులు కొందరు రాజధాని మార్పుపై ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా నిరసన తెలుపుతున్న వారికి తమకు ఎవరైనా మద్దతు తెలిపితే బాగుంటుందని కోరుకోవడం సహజం. ఆ ఉద్దేశ్యంతోనే వారు డిమాండ్ చేశారు.
కానీ చిరు రైతుల తరపున ముఖ్యమంత్రిన నిలదీసినంత మాత్రానా ఏమీ జరగదు. పైపెచ్చు చిరు అనవసరంగా రాజకీయాల్లో కలుగజేసుకున్నట్టు అవుతుంది. ఒకవేళ కలుగజేసుకున్నా ఈ కుల మీడియానే చిరుకి రాజకీయాల మీద యావ పోలేదని రచ్చ మొదలుపెడుతుంది. అందుకే చిరు వచ్చిన పని చూసుకుని వెళ్లిపోయారు. పైగా గతంలోనే చిరు తాను మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. కాబట్టి ఆయన్ను అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడాలని డిమాండ్ చేయకూడదు.
అసలు టీవీల్లో కూర్చొని రైతుల తరపున చిరును తప్పుబడుతున్న వారంతా అమరావతి వెళ్లి రైతులతో పాటే నిరసనల్లో కూర్చోవచ్చు కదా.. కానీ కూర్చోరు. వాళ్లకి కావాల్సిందల్లా ఎవరేమన్నా నవ్వుతూపోయే చిరును అల్లరి చేయడం. కొంతమందైతే సినిమా స్టార్లు జనం డబ్బుతో హోదాలు, పరపతులు పెంచుకున్నారని, ఆయనకు సమాజం పట్ల ఆమాత్రం భాద్యత లేదా అని మాట్లాడుతున్నారు. మరి పరిశ్రమలో చిరుతో పాటే నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా చాలామంది స్టార్లున్నారు. వాళ్లను కూడా రైతుల తరపున మాట్లాడమని అడగొచ్చు కదా. అలా అడగరు.
వాళ్లకి కావాల్సింది చిరంజీవి రొచ్చులోకి లాగడం. కుల ముద్ర వేసి బద్నాం చేయడం. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. ఈ పద్దతి పట్ల మెగా అభిమానులే కాదు సామాన్య జనం సైతం అసలు చిరాకుపడుతున్నారు. ఎన్ని మొట్టికాయలు పడినా ఈ కులవ్యాధిగ్రస్తులు మారారని మండిపడుతున్నారు.