జగన్ తో పోలిస్తే వెనుకబడ్డ కెసిఆర్

తెలంగాణకు ఎలాంటి భయం వద్దు, వైరస్ వస్తే దాన్ని మూలంగా నాశనం చేస్తాం, లక్ష మందికి వచ్చినా చికిత్స ఇవ్వడానికి సిద్దం, 5 వేల కోట్లు ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడం.. ఇవి కరోనా లాక్ డౌన్ ఆరంభంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు.  కానీ వాస్తవ పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా ఉంది.  రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు.  దీనికి ప్రధాన కారణం టెస్టుల సంఖ్య పెరగకపోవడమే.  టెస్టులు లేకపోవడంతో వైరస్ సోకిన వారిని గుర్తించలేకపోతున్నారు.  తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు.  
 
ఒక్కసారి తెలంగాణలో కేసులు పెరిగిన తీరు గమనిస్తే కేవలం ఒక్క నెలలోనే దాదాపు 8000 కేసులు పెరిగాయి.  దీన్ని బట్టి వైరస్ చాప కింద నీరులా ఎలా వ్యాపిస్తోందని అర్థమవుతోంది.  తెలంగాణలో మార్చి 2న మొదటి కరోనా కేసు నమోదవగా ఏప్రిల్ 26కు ఆ సంఖ్య 1000కి చేరింది.  ఈ సంఖ్యను బట్టి రాష్ట్రంలో వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెటర్ అని అనుకున్నారు.  కానీ టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటమే కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణమని అప్పుడు గ్రహించలేకపోయారు.  
 
 
కానీ జూన్ 3నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 3000లకు చేరడంతో జనంలో కంగారు మొదలైంది.  జూన్ 10 నాటికి 4000లకు చేరడం, చేస్తున్న రోజువారీ టెస్టుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉండటంతో ప్రభుత్వం మీద ఒత్తిడి స్టార్టయింది.   న్యాయస్థానం టెస్టుల పరిమాణం తక్కువగా ఉండటం మీద వివరణ ఇవ్వాలని ఆదేశించడం, సర్కార్ నుండి సరైన స్పందన లేకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగిపోయింది.  ఇక కేసుల సంఖ్య జూన్ 15 కు 5000, జూన్ 18కి 6000, జూన్ 22 కి 8000, జూన్ 24కు 10,444 కు చేరాయి.  మరణాల సంఖ్య 225కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,858 యాక్టివ్ కేసులున్నాయి.  ఇక పరీక్షల సంఖ్య మొత్తంగా 67,318 గా ఉంది.  
 
 
పక్క రాష్ట్రం ఏపీలో గడిచిన 24 గంటల్లో 36,047 టెస్టులు చేశారు.  ఇది ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన మొత్తం పరీక్షల్లో సగం కంటే ఎక్కవ.  ఈ లెక్కలు చూసిన తెలంగాణ ప్రజలు మొదటిసారి సీఎం అయిన జగన్ ఇంత సమర్థంగా పనిచేస్తుంటే కేసీఆర్ మాత్రం వెనకబడ్డారని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఇక ప్రతిపక్షాలైతే కేసీఆర్ కావాలనే కేసుల విషయంలో ప్రజల్ని మభ్యపెడుతూ రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆరోపణలు చేస్తున్నారు.