టాలీవుడ్ లో అప్పుడప్పుడు అనూహ్యంగా కొన్ని కొన్ని కాంబినేషన్స్ తెరపైకి వస్తుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు విస్తుపోవడం తప్ప! ఆలోచనకు కూడా సమయం కూడా ఉండదు. తాజాగా అలాంటి కాంబినేషన్ ఒకటి తెరపైకి వచ్చింది. అదే అల్లు అరవింద్-రాజశేఖర్ కాంబినేషన్. మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన జోసెఫ్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి మందుకొచ్చినట్లు సమాచారం. 2018లో ఈ సినిమా విడుదలై అక్కడ మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా హక్కులను గీతా ఆర్స్ట్ అనుబంధ సంస్థ అయిన జీఏ-2 పిక్చర్స్ దక్కించుకుంది. ఇందులో హీరోగా రాజశేఖర్ అయితే బాగుంటుందని స్వయంగా అల్లు అరవింద్ నిర్ణయించుకునే ఆయనే ఫోన్ చేసి అడిగారుట.
అరవింద్ నుంచి ఫోన్ రాగానే రాజశేఖర్ మారు మాట్లాడుకుండా ఎస్ చెప్పేసారుట. అయితే మెగా ఫ్యామిలీ- రాజశేఖర్ ఫ్యామిలీ మధ్య చిన్న పాటి విబేధాలున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ విబేధాలు మరోసారి `మా` సమావేశంలో భగ్గుమన్నాయి. రాజశేఖర్ ని తొక్కస్తున్నారంటూ చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు వంటి వారి ముందే తన అసహనాన్ని వెళ్లగక్కారు. దీనిపై చిరంజీవి కూడా అంతే సీరియస్ అయారు. రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలంటూ మా ను కోరారు.
అయితే అలాంటి విబేధాలు వేటితోను సంబంధం లేకుండా అల్లు అరవింద్ అయనతో సినిమా నిర్మించడానికి ముందుకు రావడం విశేషం. ఇది ఓ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. పలాస 1978 చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కరుణ్ కుమార్ తెరకెక్కించనున్నారుట. గతంలో రాజశేఖర్ హీరోగా అల్లు అరవింద్ న్యాయం కోసం అనే సినిమా నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ తెరపైకి రావడం విశేషం.