కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. రీచ్ నుండి లోడైన ఇసుక ఎక్కడికి పోతుందో కూడా తెలియడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ నేతలే పెద్ద తలలు ఇసుక మాఫియాను నడుపుతున్నారని అర్థం వచ్చేలా నియోజకవర్గంలోని ప్రజలకు ట్రాక్టర్ ఇసుక ఇప్పించుకోలేని దుస్థితిలో ఉన్నామని వినుకొండ ఎమ్మెల్యే వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు వైసీపీ నేతలు చంద్రబాబు, టీడీపీ నేతలు ఇసుకను బ్లాక్లో అమ్ముకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
నిజంగానే చంద్రబాబు నాయుడి పాలనలో ఇసుక మాఫియా నడిచింది. స్థానిక నేతలు ఇష్టారీతిన బ్లాక్లో ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు అదే పని అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి 5 నెలలు ఇసుక సరఫరా నిలిపివేసి నిర్మాణ రంగం కుదేలయ్యేలా చేసిన జగన్ సర్కార్ ఆతర్వాత ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి టన్ను ఇసుక 375 రూపాయలకే ఇస్తామని అన్నారు. కానీ ఆన్ లైన్ విధానంలో అరపూరటకే ఇసుక స్టాక్ లేదని చూపడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొందరు వ్యక్తులు సిండికేట్లుగా ఏర్పడి ఆన్ లైన్ ద్వారా పెద్ద మొత్తంలో టోకెన్లు బుక్ చేసుకుని వాటిని అధిక ధరకు విక్రయించేవారు. కొందరు దళారులు లారీ ఇసుకను 30 వేలకు బ్లాక్లో అమ్ముతుండటంతో సామాన్యులు కొనలేక ఊరుకునేవారు. దీంతో దళారులు ఆ ఇసుకను డిమాండ్ అధికంగా ఉన్న పక్క రాష్ట్రాల్లో భారీ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో మన ఇసుక మన ప్రజలకు ట్రాక్టర్ దొరకడం కూడా గగనమైపోయింది. ఫలితంగా నిర్మాణ రంగం ఇప్పటికీ నత్త నడకనే సాగుతోంది. బిల్డర్లు బాబు హయాంలో బ్లాక్లో అయినా ఇసుక దొరికేది.. కానీ ఇప్పుడు అసలు ఇసుకే దొరకడంలేదని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బాబు సర్కార్ ఎలాగైతే ఇసుక మాఫియా మూలంగా అప్రదిష్ట పాలైందో జగన్ సర్కార్ సైతం అలాగే నష్టపోవాల్సి ఉంటుంది.