ఏడుపొక్కటే తక్కువ. కానీ, ఆ ఏడుపుని అదుపులో పెట్టకోక తప్పలేదు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని ఎదిరిస్తే ఏమవుతుందో ఆయనకు బాగా తెలుసు. గతంలో బీజేపీని ఎదిరించినప్పటికీ, ఇప్పటి పరిస్థితులకీ చాలా తేడా వుంది. ఆయనెవరో కాదు, కర్నాటక బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప. ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాస్సేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అధిష్టానం ఆదేశాలతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నిన్న రాత్రి వరకూ రాజీనామా చేసే విషయమై తటపటాయించిన యడ్యూరప్ప, అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూసీ చూసీ అలసిపోయారు. ఈ రోజు ఉదయాన్నే యడ్యూరప్పపై రాజీనామా ఆదేశాలు బీజేపీ అధిష్టానం నుంచి జారీ అయ్యాయి. కొద్ది గంటల వ్యవధిలోనే వికెట్ పడిపోయింది.
‘అబ్బే, ఆయన చాలా బాగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదు..’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న వ్యాఖ్యానించారుగానీ.. జేపీ నడ్డా ప్రకటనకు కూడా విలువ లేకుండా పోయింది. ఇప్పుడు యడ్యూరప్ప ముందున్న ఆప్షన్స్ ఏంటి.? ఏమీ లేవు. ఎందుకంటే, ఆయన ఇప్పుడు బీజేపీని ఎదిరించలేరు. ‘ఎవరు ముఖ్యమంత్రి అయినా వారికి నా సహాయ సహకారాలుంటాయి. ప్రభుత్వంలో, పార్టీలో పదవుల్లేకపోయినా పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను..’ అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు యడ్యూరప్ప. యడ్యూరప్ప వికెట్ పడింది సరే, కొత్త బకరా ఎవరు.? అదేనండీ, బీజేపీ అధిష్టానం దయతో.. ముఖ్యమంత్రి పదవికి నామినేట్ అయ్యే ఆ బీజేపీ నేత ఎవరు.? ఎన్నాళ్ళు ఆ పదవిలో ఆయన వుండగలుగుతారు.? ఎవరు అధికార పీఠమెక్కినాసరే.. ప్రస్తుతానికి కర్నాటక ముఖ్యమంత్రి పదవి అంటే, ముళ్ళ కుర్చీనే. అయినా, కర్నాటక రాజకీయాల్లో ఇదేమీ కొత్త కాదు. బీజేపీకి అసలే కొత్త కాదు.