తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. తెలుగు రాజకీయాల్లో బాబు వేసిన వ్యూహాలకు చాలా మంది నాయకులకు రాజకీయ జీవితం లేకుండా పోయింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి బాబు యొక్క రాజకీయ చాణిక్యత మొద్దుబారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే బాబు వ్యూహాల్లో పదును తగ్గిందని చెప్పాల్సి వస్తుంది.
జగన్ విషయంలో చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నారు
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అవసరమైన దానికంటే కూడా అధిక శ్రద్ద పెట్టి జగన్ యొక్క ప్రాధాన్యతను చంద్రబాబే పెంచారు. మూడు నెలల కుర్ర ఎంపీ జగన్ ను ఆనాడు అతి పెద్ద భూతంగా ఊహించేసుకుని ఇంతటి పొలిటికల్ ఎవరెస్ట్ శిఖరం చేసిన ఘనత చంద్రబాబుది. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించడానికి కారణం ఆయన ఇచ్చిన హామీలు. అయితే ఇప్పుడు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల జగన్ ఆ హామీలను నెరవేర్చడం చాలా కష్టం. ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చకపోతే ప్రజలే జగన్ కు వ్యతిరేకం అవుతారు. కానీ చంద్రబాబు మాత్రం కొంచెం కూడా ఓపిక పట్టకుండా ఇప్పుడే జగన్ విమర్శిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని జగన్ అనుకూలంగా వాడుకుంటూ బాబు అడ్డుపడటం వల్లే తాము ఇచ్చిన హామీలను నెరేవేర్చలేకపోయామని చెప్తూ సింపతీ పొందుతున్నారు. ఇలాగే చంద్రబాబు చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తూ జగన్ యొక్క రాజకీయ ఉన్నతకి దోహదం చేస్తున్నారు.
బాబు ఆలోచన మందగించిందా!!
గతకొన్ని సంవత్సరాల నుండి బాబు యొక్క రాజకీయ వ్యూహాలను చూస్తే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం మందగించిందని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న రాజకీయ వ్యూహాలన్ని ఆయనే వ్యతిరేకంగా మారుతున్నాయి. 2018 వేళ బీజేపీ నుంచి బయటకు వచ్చి మోడీ మీద పోరాటం చెయ్యడం, కాంగ్రెస్ తో కలిసి పని చెయ్యడం వంటి అంశాలు చూస్తే ఆయన రాజకీయ వ్యూహాలు వెనక ఉన్న తెలివితక్కువ తనం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై అనవసరంగా విరుచుకుపడుతూ తనకే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు.