యువ సంచలనం, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా ఒక చిత్రం రూపొందనుంది. Prasiddha చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రతిభ గల దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.
కథానాయకుడిగా విశ్వక్ సేన్ కి ఇది 11వ చిత్రం. నేడు(మార్చి 29) విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటల 16 నిమిషాలకు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో రాత్రిపూట నిర్మానుష్య ప్రాంతం నుంచి సరుకుతో ఉన్న మూడు లారీలు బయల్దేరి పోర్టుకి వెళ్తుంటాయి. రాజమండ్రిలోని గోదావరి వంతెనను కూడా వీడియోలో చూపించారు. అలాగే ఒక పడవపై ఉన్న రేడియోను గమనించవచ్చు. “సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో.. బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది” అంటూ వీడియోను చాలా ఆస్తికరంగా రూపొందించారు. దీనిని బట్టి చూస్తే ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందనున్న పీరియాడిక్ ఫిల్మ్ అనిపిస్తోంది. ఇక “మాస్ కా దాస్ ‘బ్యాడ్’ గా మారాడు” అంటూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఎంతో ఇంటెన్స్ తో రూపొందించిన ఈ వీడియోలో యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’తో అలరించిన విశ్వక్ సేన్.. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మరో ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ జనరేషన్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. ముఖ్యంగా యువతలో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ సితార బ్యానర్ లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు. విశ్వక్ సేన్, సితార బ్యానర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటనతోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
తారాగణం: విశ్వక్ సేన్
దర్శకుడు: కృష్ణ చైతన్య
సంగీతం: యువన్ శంకర్ రాజా
సహ నిర్మాతలు: వెంకట్, గోపి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్