‘మాస్ జాతర’ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’, ‘హుడియో హుడియో’ గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, నాలుగో గీతంగా ఉత్సాహభరితమైన మాస్ పాట ‘సూపర్ డూపర్’ను విడుదల చేసింది. రవితేజ మాస్ కి, శ్రీలీల ఎనర్జీకి తగ్గట్టుగా స్వరపరిచిన ఈ బ్లాక్ బస్టర్ ట్యూన్ అందరినీ కట్టిపడేస్తోంది. ‘మాస్ జాతర’ చిత్రాన్ని, ఆల్బమ్ ని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ఈ ‘సూపర్ డూపర్’ గీతముంది.
రెండు ఉత్సాహభరితమైన పాటలు, ఓ మంచి మెలోడీతో ఇప్పటికే ‘మాస్ జాతర’ ఆల్బమ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా విడుదలైన మాస్ ని ఉర్రూతలూగించే ఈ ‘సూపర్ డూపర్’ గీతం, ఆ స్థానాన్ని మరింత పదిలం చేసింది. మునుపటి మాస్ మహారాజా రవితేజను గుర్తుచేసేలా, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే స్వాగ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలీల తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో మరోసారి తెరపై వెలుగులు వెదజల్లారు. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ మాస్ గీతాన్ని ప్రేక్షకులు మెచ్చే నిజమైన వేడుకలా మలిచాయి.
‘సూపర్ డూపర్’ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ ని మెప్పించడంతో పాటు, అందరినీ కాలు కదిపేలా చేసేలా ఎంతో హుషారుగా ఈ గీతముంది. భీమ్స్ సిసిరోలియోతో కలిసి రోహిణి సోరట్ ఆలపించడం ఈ పాటకు మరింత హుషారుని తీసుకొని వచ్చింది. గీత రచయిత సురేష్ గంగుల అందరూ పాడుకునేలా ఉల్లాసభరితమైన సాహిత్యాన్ని అందించి ఆకట్టుకున్నారు. సంగీతం, గానం, సాహిత్యం అన్నీ చక్కగా కుదిరి.. ‘సూపర్ డూపర్’ను ఓ గొప్ప మాస్ గీతంగా తీర్చిదిద్దాయి.
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ‘మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుండి ‘మాస్ జాతర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, మూడు పాటలకు విశేష స్పందన లభించింది. తాజాగా విడుదలైన నాలుగో గీతం ‘సూపర్ డూపర్’, సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. కొద్దిరోజులుగా ప్రత్యేక ఇంటర్వ్యూలతో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ కూడా త్వరలో రానుంది. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.
చిత్రం: మాస్ జాతర
తారాగణం: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను భోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్


