దీపావళి కానుకగా శివకార్తికేయన్ ‘అయలాన్’ విడుదల

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం.

‘అయలాన్’ ఫస్ట్ లుక్ చూస్తే… శివకార్తికేయన్, పక్కన ఏలియన్ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఈ తరహా సినిమా రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇంతకు ముందు కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి. అయితే, ఇటువంటి ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రాలేదు.

దీపావళి కానుకగా ‘అయలాన్’ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత కోటపాడి జె. రాజేష్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ ”మేం ఎంతో ప్రేమతో, మనసుపెట్టి చేసిన చిత్రమిది. ఈ జర్నీలో మాకు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యాన్ని కోల్పోలేదు. పట్టుదలతో సినిమా చేశాం. ఇప్పుడు విడుదల తేదీ అనౌన్స్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఎంతో మద్దతు ఇస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. వాళ్ళ అంచనాలకు మించి సినిమా ఉంటుంది” అని చెప్పారు.

సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్, అందులోనూ ఏలియన్స్ నేపథ్యంలో తీసే సినిమాలు అంటే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం చాలా కష్టపడ్డారు. ‘అయలాన్’లో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా ఇదేనని చిత్ర బృందం తెలియజేసింది. పలు సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఫాంటమ్ ఎఫ్ఎక్స్ కంపెనీ ‘అయలాన్’లో ఏలియన్ సహా ఇతర గ్రాఫిక్స్ వర్క్ చేసింది. పాన్ ఇండియా సినిమాలో ఇన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటం ఇదే తొలిసారి, పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ సమయం పట్టిందని చిత్ర బృందం తెలిపింది.

తెలుగులో ‘చంద్రలేఖ’, ‘ప్రేమతో రా’, ‘కేశవ’ చిత్రాల్లో నటించిన ఇషా కొప్పికర్, ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషించారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ శరద్ కేల్కర్ మరో పాత్ర చేశారు. సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాకు పని చేసిన నీరవ్ షా ‘అయలాన్’కు వర్క్ చేశారు. ఈ సినిమాకు రూబెన్ ఎడిటర్. ఇంకా ఈ చిత్రానికి పోస్టర్ డిజైన్ : గోపి ప్రసన్న, ప్రొడక్షన్ డిజైన్ : టి. ముత్తురాజ్, వీఎఫ్ఎక్స్ : బిజోయ్ ఆర్పుతరాజ్ (ఫాంటమ్ ఎఫ్ఎక్స్), కాస్ట్యూమ్ డిజైన్ : పల్లవి సింగ్, నీరజా కోన, కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య, పరేష్ శిరోద్కర్, సతీష్ కుమార్, సంగీతం : ఏఆర్ రెహమాన్, నిర్మాతలు : కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా, దర్శకత్వం : ఆర్. రవికుమార్.