దసరా స్పెషల్‌గా అక్టోబర్ 20న ఆహాలో ‘సర్వం శక్తి మయం’

ప్రియమణి, సంజయ్ సూరి మెయిన్ లీడ్‌గా ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి తెరకెక్కించాడు. బివిఎస్. రవి కథ అందించడంతో పాటు క్రియేటర్ గా వ్యవహరించారు. హేమంత్ మధుకర్ క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించారు. అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని ఈ వెబ్ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించారు.

ఆహాలో ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు యూనిట్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి తిరుగుతుంది. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి అన్ని శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుంది. మరోవైపు ఒక నాస్తికుడు ఆస్తికుడైయ్యే ప్రయాణంగా సనాతన ధర్మం గురించి చర్చగా కూడా కథ సాగుతుంది.

ఈ వెబ్ సిరీస్‌లో మొత్తంగా పది ఎసిసోడ్‌లు ఉంటాయి. ఇక ఈ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం జరుగుతుంది. మరో వైపు ఓటీటీలో ఇలా అష్టాదశక్తి పీఠాల మహత్యం చెప్పేలా వెబ్ సిరీస్ రానుంది. ఈ సిరీస్ ద్వారా మొత్తం భారతదేశం లో ని 17 శక్తిపీఠాలతో పాటు శ్రీలంకలోని శక్తిపీఠం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ దసరాకు ‘సర్వం శక్తి మయం’ అనే ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలోనూ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రాజెక్టులో ప్రియమణి, సంజయ్ సూరిలతో పాటుగా.. సమీర్ సోని, సుబ్బరాజు, అభయ్ సింహా, అశ్లేష ఠాకూర్, కుషితా కల్లాపు వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.