ప్రియాంక చోప్రా ఈవెంట్‌కు ఉపాస‌న, రామ్ చ‌ర‌ణ్

ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు రామ్ చరణ్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌లు ఈవెంట్స్‌లోనూ ప్ర‌త్యేకంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా లాస్ ఏంజిల్స్‌లోని పార‌మౌంట్ పిక్చ‌ర్స్ స్టూడియోస్‌లో ప్రియాంక‌ చోప్రా (మ‌లాల యూస‌ఫ్ జైతో క‌లిసి) హోస్ట్ చేసిన ప్ర‌త్యేక‌మైన కార్యక్ర‌మంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ పాల్గొన్నారు.

దక్షిణాసియాకి చెందిన చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయిన సందర్భంగా ఈ పార్టీ ఇచ్చింది పారామౌంట్ సంస్థ. ఈ కార్య‌క్ర‌మంలో ద‌క్షిణాసియాకు చెందిన నటులు, నిపుణులు, ఆస్కార్ నామినీస్‌, ఇతర సెలెబ్రిటీలు పాల్గొన్నారు.

రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఆయన స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల‌ కూడా ఈవెంట్‌కి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్రియాంకు ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు. ‘‘మాకు అండగా నిలిచేందుకు వచ్చిన ప్రియాంకకు కృతజ్ఞతలు,” అని తెలిపారు. తన భర్త రామ్ చరణ్, ప్రియాంక చోప్రాతో కలిసి ఉన్న ఫొటోల‌ను ఆమె షేర్ చేసుకున్నారు. వ‌రుస ఇంట‌ర్వ్యూస్‌తో బిజీగా ఉన్నప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్ పార్టీకి స‌మ‌యాన్ని కేటాయించి హాజ‌ర‌య్యారు.

అంజుల ఆచార్య‌, మిండి కలింగ్‌, కుమైల్ నంజైని, క‌ల్ పెన్‌, అజీజ్ అన్సారీ, బెలా బ‌జ్రియా, రాధికా జోన్స్‌, జోసెఫ్ ప‌టేల్‌, శ్రుతీ గంగూలీ, అనితా ఛ‌ట‌ర్జీ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.