కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో, జైనీ క్రియేషన్స్ బ్యానరులో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన “ప్రజాకవి కాళోజీ.” సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికయినందుకు, ఈ సినీ దర్శకుడు, ప్రముఖ నవలా రచయిత డాక్టర్ ప్రభాకర్ జైనీ తన హర్షాన్ని వ్యక్తం చేసారు. పదేళ్ళుగా ఎదురు చూస్తున్న శుభ తరుణం ఆసన్నమయినందుకు, తన స్వప్నం సాకారమయినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
మంచి చిత్రాలు, సామాజిక ప్రయోజనం కల చిత్రాలు తీయాలనే ఉద్దేశ్యంతోనే తాను ఇప్పటి వరకు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించానని చెబుతూ,
(1) అమ్మా! నీకు వందనం!!.. కృత్రిమ గర్భధారణ అంశం
(2) ప్రణయ వీధుల్లో పోరాడే ప్రిన్స్.. రామప్ప దేవాలయ సంరక్షణ
(3) క్యాంపస్ అంపశయ్య.. అంపశయ్య నవల
(4) ప్రజాకవి కాళోజీ
ఆ సినిమాల పేర్లు తెలియచేసారు.
తెలుగు సినిమా రంగంలో, మంచి సినిమాలు, చిన్న సినిమాలు తీయడం వరకు ఓకే గానీ తర్వాత వాటిని మార్కెటింగ్ చేయడం, చాలా కష్టం. చెత్త, రొడ్డకొట్టుడు సినిమాలకు లభించే ఏ అవకాశమూ చిన్న సినిమాలకు లభించదు. ప్రమోషన్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు అందరూ మోసం చేస్తారు.
మంచి సినిమాలకు తెలంగాణా ప్రభుత్వం కూడా సహాయం చేయడం లేదు. కాళోజీ గారిని ‘ఆహా ఓహో’ అని సంవత్సరానికోసారి పొగిడే ప్రభుత్వ పెద్దల ముందు మొరపెట్టుకున్నా, ఒక్క రూపాయి సబ్సిడీ కానీ, వినోదపు పన్ను రాయితీ కానీ, కనీసం అపాయింట్మెంట్ గానీ లభించ లేదు. పెద్ద పెద్ద నటులకు, నిర్మాతలకు సులభంగా దొరికే అపాయింట్మెంట్, నేను నెలల తరబడి తిరిగినా నాకు లభించలేదు.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఏమైనా ఆదుకుంటారేమో చూడాలి.
నేను ‘ప్రజాకవి కాళోజీ’ సినిమా పూర్తి చేసాను కానీ, విడుదల చేయలేకపోతున్నాను. ప్రకటనలకు, థియేటర్లకు, క్యూబ్ కు కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, దుస్థితి. కరోనా తరువాత సినిమా నిర్మాణపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. నేను అంతకు ముందు తీసిన మూడు సినిమాలకు అనేక అవార్డులు వచ్చాయి కానీ, ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. సినిమా రిలీజ్ చేయడానికి కూడా థియేటర్లకు లక్షల రూపాయలు కట్టవలసిన దుస్థితి. ఎందుకంటే, ‘మీ సినిమాలో ఫైట్లు, ఐటెమ్స్ సాంగులు, పెద్ద పెద్ద నటులు లేరని’ వెక్కిరిస్తున్నారు. ప్రజాకవి కాళోజి గారి సినిమాలో ఫైట్లు, ఐటెం సాంగులు ఎలా పెట్టగలను? ప్రస్తుతమున్న ఏ నటుడైనా కాళోజీని పోలి ఉన్నాడా? అందుకే కాళోజీని పోలి ఉన్న నటుడినే ఎంపిక చేసాము. అతనికే, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది.
ప్రస్తుతం తెలుగు సినీరంగంలోని మన వాళ్ళు ఎవరూ మనకు అవార్డులు ఇవ్వరు. అంతే కాకుండా మనవాళ్ళు జ్యూరీలుగా ఉన్న సందర్భాలలో కూడా చిన్న సినిమాలకు అవి మంచివైనా సరే, వాటికి అవార్డులు రాకుండా చూస్తారు.
ఇందులో సినిమా వాళ్ళ తప్పేమీ లేదనిపిస్తుంది. తెలుగు సినీ ప్రేక్షకులు కూడా చెత్త సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయారు. పోనీ, అది అన్ని భాషల్లో జరిగే పరిణామమే అనుకున్నా, మిగిలిన అన్ని భాషల్లో రొడ్డకొట్టుడు సినిమాలతో పాటు చిన్న మంచి సినిమాలకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం ఇస్తుంది. ప్రేక్షకులు కూడా మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ వచ్చాక అనేక భాషల్లోని మంచి సినిమాలను మన వాళ్ళు ఆదరిస్తున్నారు. కానీ, తెలుగు సినిమాలకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఓటీటీల్లో వచ్చే తెలుగు సినిమాల్లో యువత తాగడం, తినడం, సిగరెట్లు, డ్రగ్స్, వ్యభిచారం, మూఢాచారాలు, దొంగతనాలు, దోపిడీలు చేస్తేనే మనవాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు.
ఇటువంటి సినిమాల వల్ల సమాజానికి ఏం ప్రయోజనం?
ఈ నాటి యువతరం, క్రమంగా కాళోజీని మర్చిపోతుంది. ఈ నాటి మన చైతన్యవంతమైన సమాజానికి ముఖ్యకారకుడు కాళోజీ. ప్రజలను ప్రశ్నించమని ఉసి కొల్పాడు. ఓటేసేటప్పుడు ఉండాలి బుద్ధి అని బోధించాడు. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంత పొలిమేరల్లోనే పాతి పెట్టాలన్నాడు. ఈ ఎన్నికల్లో ఆ బోధనల ఫలితం మనం చూసాము. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో ‘పద్మ విభూషణ్’ పొందిన ఏకైక కవి కాళోజి. మన తెలుగు జాతి వారసత్వ సంపద కాళోజీ.
సుబ్రమణ్య భారతి పైన సినిమా తీస్తే తమిళ ప్రజలు విరగబడి చూసారు. ఆ పాత్ర వేసిన షియాజీ షిండే రూపం, వాచకం, అభినయం ఏవీ బాగా లేకున్నా ప్రజలు నీరాజనాలు పలికారు. రిక్షా సోదరులు రిక్షాలను తనఖా పెట్టి ఆ సినిమాను చూసారు.
కానీ, ప్రజాకవి కాళోజీ సినిమాలో, కాళోజీ పాత్రధారి అచ్చుగుద్దినట్టుగా కాళోజీలా ఉన్నారు. అద్భుతమైన అభినయంతో పాటూ, నాలుగు గొప్ప పాటలను గోరేటి వెంకన్న, వందే మాతరం శ్రీనివాస్, మాళవిక, భూదేవి పాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారికీ మాదొక చిన్న విన్నపం. మీరొకసారి దయచేసి మా సినిమా ‘ప్రజాకవి కాళోజీ’ ని చూడండి. మేము పడ్డ కష్టాన్ని గుర్తించండి. మీ చిన్న ప్రశంస మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అచ్చమైన తెలంగాణా సినిమాను బ్రతికించండి.
ఇటువంటి తరుణంలో, కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వారు జాతీయ ఉత్తమ సినిమాగా, జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం మాలో జవసత్వాలను నింపింది, మరిన్ని మంచి, చిన్న సినిమాలు తీయడానికి పురిగొల్పింది.
అందుకే, మళ్ళీ ‘స్వాతీ బలరామ్ – అతడే ఒక సైన్యం’ అనే స్వాతి సంపాదకులు వేమూరి బలరామ్ గారి బయోపిక్ తీయడానికి పూనుకున్నాము.