భయపెడుతున్న ‘పిండం – ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ట్రైలర్

ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది. అదే ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

పిండం ట్రైలర్ గురువారం ఉదయం 11:45 గంటలకు విడుదలైంది. 3 నిమిషాల 45 సెకన్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈశ్వరీ రావుతో “మరణం అనేది నిజంగానే అంతమా?. మరణించిన తరువాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా?. కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా?. ఆ ఆత్మలు మనకు నిజంగానే హని చేయగలవా?” అంటూ నిజ జీవితంలో కూడా ఎందరో తెలుసుకోవాలనుకునే ఆసక్తికర విషయాలను అవసరాల శ్రీనివాస్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమైంది. చాలా కాలంగా ఎవరూ నివసించని ఒక ఇంటిలోకి కథానాయకుడు శ్రీరామ్ కుటుంబం వస్తుంది. ఆ ఇంట్లో వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మ ఆ కుటుంబానికి నిద్ర కూడా లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది.

అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి వచ్చిన ఈశ్వరీ రావు “మీ కుటుంబాన్ని వేధిస్తున్నది ఒక్క ఆత్మ కాదు” అని చెప్పడం మరింత ఉత్కంఠగా మారింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ నడిచింది. ఇక ప్రారంభంలో అవసరాల శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా “ఒక వస్తువుని తగలబెట్టినా, నరికినా, పూడ్చినా అది అంతమైపోతుందని మనం భ్రమపడతాం. కానీ ఆ వస్తువులోని అంతర్గత శక్తిని, ఆ ఎనర్జీని మనం ఎప్పటికీ నిర్మూలించలేం. ఇది శాశ్వత సత్యం.” అని ఈశ్వరీ రావు చెప్పిన మాటతో ట్రైలర్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది. ట్రైలర్ లో కెమెరా పనితనం కానీ, నేపథ్య సంగీతం కానీ హారర్ చిత్రానికి తగ్గట్టుగా అద్భుతంగా కుదిరాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే థియేటర్ లో ప్రేక్షకులు అసలైన హారర్ అనుభూతిని పొందడం ఖాయమనిపిస్తోంది. ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని, ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. ఇలా మూడు కాలక్రమాలలో జరుగుతుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

తారాగణం: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు

కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
డీఓపీ: సతీష్ మనోహర్
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
ఆర్ట్: విష్ణు నాయర్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
కాస్ట్యూమ్స్: పద్మ ప్రియ
పోరాటాలు: జష్వ
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ వర్మ. వి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స
సహ నిర్మాత: ప్రభు రాజా
సమర్పణ: ఆరోహి దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి