గీతా ఆర్ట్స్‌ నుంచి కోటబొమ్మాళి పిఎస్‌!

’భలే భలే మగాడివోయ్‌’, ’గీత గోవిందం’ ’టాక్సీవాలా’, ’ప్రతి రోజు పండగే’, ’మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ లాంటి అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్‌ సంస్థ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా మలయాళంలో సూపర్‌ హిట్‌ అయినా ’నాయాట్టు’ అనే సినిమాని తెలుగులో ’కోట బొమ్మాళి పిఎస్‌’ పేరుతో రీమేక్‌ తీసి విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.ఈ తెలుగు రీమేక్‌ లో సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ మేక ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. అలాగే రాహుల్‌ విజయ్‌ , శివాని రాజశేఖర్‌ లు కూడా రెండు కీలక పాత్రల్లో కనపడనున్నారని తెలిసింది.

ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ ఆమధ్య విడుదల చేశారు, అది కొంచెం ఆసక్తిని పెంచింది. అయితే ఈ ప్రచారాలని కొంచెం ఎక్కువ చెయ్యాలని తలచి, ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చెయ్యాలని నిర్మాతలు భావించారు. అందుకోసమని ఒక ప్రత్యేక పాటని ఈ సినిమా నుండి ఈ నెల అంటే సెప్టెంబర్‌ 11న విడుదల చేయను న్నారని ప్రకటించారు.

అయితే ఈ పాట శ్రీకాకుళం యాసలో వుండే ఒక ఆసక్తికర పాట అని, పూర్తిస్థాయి ఫోక్‌ సాంగ్‌ తో వస్తున్న ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెపుతున్నారు దర్శకర్మాతలు. ’జోహార్‌’, ’అర్జున ఫాల్గుణ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్నిఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.