కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని ‘సంక్రాంతి కింగ్’ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కంగ్రాట్స్ మీట్ ని నిర్వహించింది. కింగ్ నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో అసోసియేషన్ తరపున ‘నా సామిరంగ’ చిత్ర యూనిట్ ని ఘనంగా సత్కరించారు.
కంగ్రాట్స్ మీట్ లో కింగ్ నాగార్జున అక్కినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ్ తో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. మా అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కళ్ళు మూసి తెరిచేలోగ చక్కగా సినిమా పూర్తి చేసేశాడు.( నవ్వుతూ) సినిమాని ఒక పాటలా చాలా అందంగా తీశాడు. కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ప్రతి షాట్ ని మంచి ప్లాన్ తో తీర్చిదిద్దాడు. తనకి ఏం కావాలో తెలుసు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు. మా ఎడిటర్ కి పెద్ద పని పెట్టలేదు. అలా తీయడం అంత ఈజీ కాదు. ఇలా చేయాలంటే నిర్ణయాలు చాలా క్లారిటీగా తీసుకోవాలి. నేను దాదాపు 95 పైగా చిత్రాలు చేశాను. ఇందులో ఇలాంటి చక్కటి క్లారిటీతో వున్న కొద్దిమందిలో విజయ్ ఒకరు. విజయ్ కి ఆల్ ది బెస్ట్. అలాగే డ్యాన్సర్స్ అసోసియేషన్ కి ఆల్ ది బెస్ట్. ఈ వేడుకు రావడం గౌరవంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విజయ్ రచ్చ గెలిచి ఇంట గెలిచాడు(నవ్వుతూ) విజయ్ నాలుగేళ్ళుగా తెలుసు. కలిసిన ప్రతి సారి డైరెక్షన్ చేయాలని అనేవారు. మా అందరితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన ఇండస్ట్రీకి ప్యాషన్ తో వచ్చారు. దర్శకుడు కావాలనే తన కలని సక్సెస్ ఫుల్ గా నెరవేర్చుకున్నారు. ఇక్కడ వున్న డ్యాన్స్ మాస్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
డైరెక్టర్ విజయ్ బిన్ని మాట్లాడుతూ.. నాగార్జున గారు నన్ను దర్శకుడి ఎంచుకోవడం నా అదృష్టం. మా అందరి తరపున నాగార్జున గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాగార్జున గారు ఇచ్చిన ప్రేమని మర్చిపోలేను. నాగార్జున గారే నన్ను దర్శకుడిని చేశారు. నరేష్ గారికి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి గారికి కృతజ్ఞతలు. కొరియోగ్రాఫర్ కావడమే చాలా పెద్ద పని. ఒక పాట తెచ్చుకొని, ఆ పాటని హిట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న ప్రాసస్. ఈ ప్రయత్నంతో చేస్తూనే డైరెక్టర్ కావాలనే నా డ్రీమ్ ని పూర్తి చేసుకున్నాను. ఈ విజయాన్ని పురస్కరించుకొని నా ఫ్యామిలీ అందరూ కంగ్రాట్స్ మీట్ ని నిర్వహించడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. సినిమా హిట్టు కొట్టినప్పుడు ఎంత ఆనందంగా ఫీలయ్యానో.. ఇప్పుడూ అంతే ఆనందంగా వుంది. ఈ అవకాశం వచ్చినపుడే నన్ను నేను నిరూపించాలని అనుకున్నాను. అనుకున్నట్లే నిరూపించుకున్నాని భావిస్తున్నాను. తక్కువ సమయంలో ఈ సినిమాని చేశామని అంటున్నారు. కానీ దిని వెనుక చాలా శ్రమ వుంది. కొరియోగ్రఫీ అనుభవం వుండటం చాలా కలిసోచ్చింది. నాలాగే చాలా మంది మంచి ప్రతిభ గల కొరియోగ్రాఫర్స్ దర్శకుడిగా రావడానికి సిద్ధంగా వున్నారు. మీ అందరి సపోర్ట్ కావాలి. నేను దర్శకుడిగా మరో సినిమా చేయబోతున్నాను. అందులో మరో కొత్త కొరియోగ్రఫర్ ని పరిచయం చేయబోతున్నాను. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. విజయ్ గారు డైరెక్షన్ చేసి గొప్ప విజయం అందుకోవడం మా అందరికీ గర్వకారణం. డ్యాన్స్ మాస్టర్స్ వాల్యుని విజయ్ గారు మరింత పెంచారు. నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు .. ఇలా ముగ్గురు హీరోలతో సినిమా చేసి విజయ్ ఇంత పెద్ద విజయం అందుకోవడం చాలా ఆనందంగా వుంది’’ అన్నారు. ఈ వేడుకలో సుజాత మాస్టర్, అజయ్ మాస్టర్, శివాజీ మాస్టర్, వీరస్వామి, సునీల్, హరి తో పాటు డ్యాన్స్ డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యులంతా పాల్గొన్నారు.