కన్నడంలో సూపర్ హిట్ అయిన కేజీఎఫ్, కాంతార సినిమాల తర్వాత అదే రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ’హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’. ఈ సినిమా తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించి అన్ని భాషల ఇండస్టీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించడంతో పాటు జాతీయ విూడియా దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ అన్ని భాషల్లో కూడా హాట్ కేక్ మాదిరిగా అమ్మడు పోయింది.
తెలుగు లో రీమేక్ కు ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ హడావుడి చేశారు. కానీ రీమేక్ ల విషయంలో ఈ మధ్య కాలంలో ఉన్న విమర్శలు వస్తున్న ఫలితాల నేపథ్యంలో రీమేక్ కంటే డబ్బింగ్ చేసి విడుదల చేయడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార సినిమాలను ఎలా అయితే డబ్ చేసి విడుదల చేయడం జరిగిందో హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే సినిమాను కూడా రీమేక్ కాకుండా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తి చేసిన ఈ సినిమాకు హాస్టల్ కుర్రాళ్లు అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారని కూడా సమాచారం అందుతోంది.
తల్లిదండ్రులకు దూరంగా ఉండే హాస్టల్ కుర్రాళ్ల ఎమోషన్స్ ను చక్కగా చూపించిన సినిమా ఇది. తెలుగు లో రీమేక్ చేస్తే ఆ ఫీల్ మిస్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో రీమేక్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. డబ్బింగ్ చేసినా కూడా ఈజీగా పాతిక కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమాను తెలుగు లో ఆగస్టు 25వ తారీకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే రోజు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దాంతో వచ్చే వారంలోనే విడుదల అయితే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు విడుదల అయినా కూడా ఈ సినిమా కంటెంట్ యూత్ ఆడియన్స్ కి ముఖ్యంగా స్టూడెంట్స్ కి, తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. తెలుగు లో ఈ హాస్టల్ కుర్రాళ్లు రావడం కన్ఫర్మ్ అయింది కానీ రీమేక్ గా కాకుండా డబ్బింగ్ తో రాబోతున్నారు!