‘పరేషాన్’ లో గొప్ప మ్యాజిక్ జరిగింది: డైరెక్టర్ తరుణ్ భాస్కర్

యంగ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రలో రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ ‘పరేషాన్. వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి కల్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సక్సెస్ మీట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అమ్మ, స్నేహితులతో కలిసి పరేషాన్ సినిమా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగే పరేషాన్ చూసినప్పుడు కలిగింది. సినిమా చూసినప్పుడు మనల్ని మనం మర్చిపొతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ పరేషాన్ లో జరిగింది. ప్రతి పాత్రతో కనెక్ట్ అయ్యాను. నేను వరంగంలో వుండే రోజులు గుర్తుకు వచ్చాయి. తిరువీర్ తో పాటు అందరూ ఎంతో సహజంగా నటించారు. ప్రతి పాత్ర గుర్తుండి పోతుంది. సినిమా పట్ల ప్యాషన్, ప్రేమతో చేసిన చిత్రమిది. ఒక సినిమా చూసి ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఇది మన కథ అని ఫీలై, ఆ పాత్రలతో కనెక్ట్ ఐతే అదే సినిమాకి వచ్చిన గొప్ప గౌరవం. అలాంటి గౌరవాన్ని తెచ్చుకునే సినిమా పరేషాన్. దర్శకుడు రూపక్ కి యూనిక్ స్టైల్ వుంది. చాలా నిజాయితీగా, స్వచ్ఛమైన మనసుతో తీసిన సినిమా ఇది. చూస్తున్నపుడు ఆ ఫ్రెష్ నెస్ కనిపించిది” అన్నారు

తిరువీర్ మాట్లాడుతూ.. ‘లగాన్’ లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. నేర్చుకుంటూనే సినిమా చేశాం. గెలవాలంటే లాస్ట్ బాల్ కి సిక్స్ కొట్టాలి. మా అదృష్టం.. రానా గారు వచ్చి సిక్స్ కొట్టించారు. ప్రేక్షకులు కోసం తీసిన సినిమా ఇది. సినిమా చూసిన అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా గర్వంగా వుంది. ఇలాంటి సినిమాలని ప్రోత్సహిస్తే కొత్త ప్రతిభ, కొత్త కథలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి” అన్నారు.

పావని కరణం మాట్లాడుతూ… పరేషాన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా అంటే ప్యాషన్ ఉన్న టీం అంతా కలిసి చేసిన చిత్రమిది. థియేటర్ లో రిలీజ్ అవ్వాలనే కలతో చేసిన సినిమా. బిగ్ స్క్రీన్ లో మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వస్తున్నంత గొప్ప రెస్పాన్స్ రావడం ఆనందాన్ని ఇస్తుంది. సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు.

రూపక్ రోనాల్డ్‌సన్ మాట్లాడుతూ.. పరేషాన్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. మేము ఊహించిన దానికంటే గొప్పగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. నైజాం లో మరో 75 థియేటర్స్ పెంచుతున్నాము. నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ వేడుకకు తరుణ్ రావడం ఆనందంగా వుంది. మన జీవితంలో ఒక కథని చాలా సహజంగా చెప్పాలని నిజాయితీగా నమ్మకంగా ఈ చిత్రం చేశాం. ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించడం ఆనందంగా వుంది. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు”’ తెలిపారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.