‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమాలో తొలి పాట ‘గణగణ మోగాలిరా…’ విడుదల చేశారు.
జాతర నేపథ్యంలో ‘గణగణ మోగాలిరా…’ పాటను తెరకెక్కించారు. పాన్ ఇండియా హిట్ ‘కాంతారా’, తెలుగులో ‘విరూపాక్ష’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బాణీకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా… వి.ఎం. మహాలింగం ఆలపించారు.
”అమ్మా డంగురు డంగురు డంగురుమా…
అమ్మా అమ్మోరు డంగురు దంగురుమా…
హారతందుకో… మమ్ము అందుకో… పూజలందుకో” అంటూ పాట మొదలైంది. ఈ పాటలో దర్శకుడు అజయ్ భూపతి కథ గురించీ కొన్ని హింట్స్ ఇచ్చారు.
”పచ్ఛా పచ్చని ఊరు మీద
పడినది పాడు కన్ను
ఆరని చిచ్చే పెట్టి పోతాదే!
ఆపేవాడు లేనే లేడు అంతా బూడిదే
తెల్లా తెల్లటి గోడ మీద
ఎర్రటి అక్షరాలు
వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే!
రాసేవాడు వీడో వాడో ఏమో తెలీదే” అంటూ పాట సాగింది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ఇది. పచ్చని పల్లెపై ఎవరి కన్నో పడటంతో మంటలు మొదలయ్యాయని, ప్రజల్లో భయం పెరిగిందని భాస్కరభట్ల సాహిత్యం ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు.
”మరణం తప్పదిక ప్రతి మంగళారం
చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం
వేట మొదలయ్యిందిరా ఇవ్వాల్సిందే ప్రాణం
తప్పుకుని పోదామన్నా పోలెవెంతో దూరం” అంటూ సాగిన తర్వాత చరణం చూస్తే… ప్రతి మంగళవారం ఊరిలో ఓ హత్య జరుగుతుందేమో? అనిపిస్తుంది. అసలు, కథ ఏమిటి? అనేది సినిమా వస్తే గానీ తెలియదు.
ఆల్రెడీ విడుదలైన ‘మంగళవారం’ టీజర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించింది. కథపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ‘ఏం చూశారండీ?’ అని లక్ష్మణ్ అడిగితే ‘ఒరేయ్ పులి! కాసేపు నువ్వు పువ్వు మూసుకుని గమ్మున ఉండరా’ అని అజయ్ ఘోష్ సమాధానం ఇవ్వడం… తుపాకీతో చైతన్య కృష్ణ గురి పెట్టడం… అమ్మవారి మాస్క్ ఎవరో తీసుకోవడం, గొంగళి కప్పుకొని మంటల మధ్యలో పాయల్ నిలబడటం, గట్టిగా ఆవేదన వ్యక్తం చేస్తూ అరవడం… ప్రతి విజువల్ ఓ ప్రశ్న వదిలింది.
నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ”కథలో కీలక సందర్భంలో ‘గణగణ మోగాలిరా’ పాట వస్తుంది. పాటల్లోనూ దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పారు. కంటెంట్‌తో కూడిన కమర్షియల్ ఫిల్మ్స్ తీశారాయన. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్, సినిమా విడుదల తేదీలను వెల్లడిస్తాం” అని చెప్పారు.
చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ”అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన బాణీ అందించారు. కొన్నేళ్ళ పాట జాతరలలో ఈ పాట వినిపిస్తుంది. మా కథను కూడా చెప్పే పాట ఇది. ఇక సినిమా విషయానికి వస్తే… గ్రామీణ నేపథ్యంలో మన తెలుగు నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు.
‘మంగళవారం’ చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది.
పాయల్ రాజ్‌పుత్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, మ్యూజిక్ : ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి, ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి, ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, పృథ్వీ, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ రాజా కృష్ణన్, కొరియోగ్రఫీ : భాను, కాస్ట్యూమ్ డిజైనర్ : ముదాసర్ మొహ్మద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, పీఆర్వో : పులగం చిన్నారాయణ, డిజిటల్ మార్కెటింగ్ : టాక్ స్కూప్, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : అజయ్ భూపతి.