క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చాలా ఉత్సాహంతో ఈ వేడుకకు విచ్చేసిన కళాభిమానులకు, మా అభిమానులకు, హనుమాన్ అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు రావడానికి దోహద పడినవి నాలుగు కారణాలు. హనుమాన్ నా ఆరాధ్య దైవం, మా ఇలవేల్పు. ఆ స్వామి గురించి తెలిపే కథ ఈ హను మాన్. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్ లు ఎక్కే స్టేజ్ కి అంచలంచెలుగా ఎదుగుతున్న తేజ సజ్జ ఒక కారణం. ఈ చిత్రం ట్రైలర్ టీజర్ లో చాలా అద్భుతమైన ఫైన్‌నెస్ కనిపించింది. ఇవి చూసిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి అడిగి తెలుసుకున్నాను. ఖచ్చితంగా ఇది గొప్ప సినిమా అవుతుందని అనిపించింది. ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిధిగా రావాలని కోరినప్పుడు ఖచ్చితంగా వస్తాను, అన్ని రకాలుగా నా ప్రోత్సాహం ఉంటుదని చెప్పడం జరిగింది. నేను కొలిచే హనుమంతుడి గురించి బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఇలాంటి వేదికపై హనుమాన్ గురించి కచ్చితంగా చెప్పాలి. మా ఇంట్లో భక్తులెవరూ లేరు. మా నాన్న కమ్యూనిస్ట్. అమ్మ కోరిక మేరకు ఎప్పుడైనా తిరుపతి వెళ్లేవారు. నేను ఏడో తరగతి చదువుతుండగా ఆంజనేయస్వామి గుడికి వెళ్లి నమస్కారం చేసుకుని వచ్చేవాడిని. ఒకసారి లాటరీలోనూ ఆ స్వామి ఫొటో వచ్చింది. దాన్ని ఇప్పటికీ ఫ్రేమ్ కట్టి పూజిస్తున్నా. హనుమాన్‌ను పూజించడం వల్ల నాన్న కోరుకున్న చోటుకి ట్రాన్స్‌ఫర్ అవడంతో ఆయన కూడాభక్తి కలిగింది. భగవంతుడు బాహ్యంగా ఉండడు. మన అంతరాత్మలో ఉంటాడు. హనుమాన్ మనకు ఆశీస్సులు అందిస్తే జీవితాంతం వదలడు. మనల్ని నిరంతరం రక్షిస్తూ మార్గ నిర్దేశం చేస్తుంటాడు. ఆయనను పూజిస్తూ క్రమశిక్షణతో నిబద్ధతతో ఈస్థాయికి వచ్చాని భావిస్తాను.
హను మాన్ టైటిల్ కూడా నా నుంచి వచ్చిందని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో `మీకిష్టమైన సూపర్ హీరో ఎవరు.. ఐరన్ మానా, బ్యాట్ మేనా, సూపర్ మానా’ అని అడిగితే… మన హనుమంతుడు ఉండగా మరో సూపర్ హీరో ఏమిటని భావించి వెంటనే ‘హను -మాన్’ అన్నాను. అది నా మనసులో వచ్చిన మాట. ఆ మాట ఈ చిత్రానికి టైటిల్ కావాలని నిర్ణయించడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ప్రశాంత్‌వర్మ విజన్, హీరో తేజ కష్టం వృథాపోవు. ఇది చాలా మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే మన కంటెంట్ లో సత్తా వుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. పెద్ద విజయం అందేలా చేస్తారు. అయితే ఇది పరీక్షాకాలం. వరుస సినిమాలు ఉన్నప్పుడు అనుకున్న థియేటర్‌లు లభించకపోవచ్చు. ఇవాళ కాకపోతే రేపు చూస్తారు. ఫస్ట్ షో కాకపోతే, సెకండ్ షో చూస్తారు. కంటెంట్ బాగుంటే, ప్రేక్షకుల మార్కులు పడతాయి. వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు.. అన్నీ సినిమాలు ఆడాలి. వాటితో పాటు హను మాన్ చిత్రం ఆడాలి. పరిశ్రమ పచ్చగా వుండాలి. 2017లో నా 150, బాలకృష్ణ గారి సినిమాలు విడుదలైన సమయంలోనే దిల్ రాజు గారి శతమానంభవతి సినిమాని విడుదల చేశారు.
‘కొంచెం డీలే చేస్తే బావుటుంది కదా’ అని దిల్ రాజు గారికి చెబితే. మా సినిమా కంటెంట్ బావుటుంది సర్. పెద్ద సినిమాల మధ్యలో కూడా ఆడుతుంది’ అని ధైర్యంగా చెప్పారు. ఆయన చెప్పినట్లే ఆ సినిమా చక్కగా ఆడింది. ఆ విధంగానే హనుమాన్ చిత్రం కూడా బాగా ఆడుతుందని కోరుకుంటున్నాను. అమృత అయ్యర్ కథానాయికగా నటిచింది. తనకి మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను. వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా పవర్ ఫుల్ పాత్రలతో అలరిస్తున్నారు. తనకి ఆల్ ది బెస్ట్. వినయ్ హాలీవుడ్ విలన్ లా కనిపిస్తున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. కెమరామెన్, సంగీత దర్శకులు, టీం అందరికీ అభినందనలు. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒక మంచి ప్రకటన నేను చేస్తే బావుటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఈ సమయంలో ఈ చిత్రం రావడం ఒక శుభపరిణామం. హను మాన్ చిత్రం ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్స్ లో ప్రతి టికెట్ పై రూ.5 అయోధ్య రామమందిరానికి ఇవ్వాలని హనుమాన్ చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. హనుమంతుని ఆశీస్సులు చిత్ర బృందానికి నిండుగా వుంటాయి. ఆ పుణ్యం దక్కుతుంది. అందరికీ వరమై ఈ చిత్రం విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జై హనుమాన్’ అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ .. ముందుగా నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహించి సినిమాని చాలా అద్భుతంగా నిర్మించడానికి అన్ని విధాల సపోర్ట్ చేశారు. ఆయన లాంటి నిర్మాత ప్రతి దర్శకుడికి దొరకాలని కోరుకుంటున్నాను. మా సినిమాకి పని చేసి ప్రతి టెక్నిషియన్స్ కి వాళ్ళ ఫ్యామిలీస్ కి పేరుపేరునా థాంక్స్. సినిమా అనేది ఒక వార్.. అవకాశం దొరకడం, మూవీ తీయడం ఒకెత్తయితే, చివరిగా రిలీజ్ చేయడం ఇంకా పెద్ద వార్. ‘ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడు’ అని మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అలా మా సినిమాకు అలా అండగా వచ్చిన హనుమంతుల వారు మెగాస్టార్ చిరంజీవి గారు. తేజ నేను కలసి జాంబిరెడ్డి చేశాం. చిరంజీవి గారితో తేజకి వున్న అనుబంధంతో అప్పుడే వెళ్లి ఆయన్ని సపోర్ట్ అడగొచ్చు. కానీ ఆయన ముందుకు వెళ్ళే అర్హత సాధించడానికి ఇంకా ఎదో పెద్దగా చేయాలని అనిపించింది. ఇప్పుడు హనుమాన్ లాంటి మంచి సినిమా తీసి, ఈ వార్ లో ఫైట్ చేయాలంటే అండ కావాలని చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి సపోర్ట్ కోరగానే మరో నిమిషం అలోచించకుండా మాకు అండగా నిలిచిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. పాలకొల్లులో చిరంజీవి గారి కటౌట్స్ కి పాలాభిశేకాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన ముందు వేదిక పై నిలుచుకున్నాను. నేను వేదికపై వున్నా చిరంజీవి గారు ఇంకా నాకు అంత ఎత్తులోనే కనిపిస్తున్నారు. హను మాన్ సూపర్ హీరో ఫిల్మ్. ఇదొక సోషియో పాంటసీ సినిమా. ఆ జోనర్ లో చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం బ్లాక్ బస్టర్. అలాంటి సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. హనుమాన్ పక్కా తెలుగు సోషియో ఫాంటసీ ఫిల్మ్. ఈ సంక్రాంతి కుటుంబం అంతా కలసి చూడదగ్గ చిత్రం. ఇది హనుమంతుల వారి కథ కాదు. ఒక సామాన్యుడికి అతీత శక్తులు వస్తే ధర్మం కోసం ఎలా పోరాడుతాడనే కథ ఇది. చాలా వినోదాత్మకంగా వుంటుంది. ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా మా ‘హను-మాన్’కు రండి. కచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
హీరో తేజ సజ్జా మాట్లాడుతూ… ‘‘నాడు రాములవారికి సాయం చేయడానికి హనుమంతులవారు వచ్చారు. నేడు మన హను-మాన్ కి సాయం చేయడానికి రాములవారే హనుమంతుని రూపంలో చిరంజీవిగారిని పంపించారని అనుకుంటున్నాను. నా జీవితంలో అమ్మనాన్నల తర్వాత కృతజ్ఞతలు చెప్పేది చిరంజీవి గారికే. ఆయన్ని చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. నా ఉనికికి, ఉన్నతికి కారణమైన చిరంజీవి గారికి పాదాభివందనం. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్‌వర్మ కన్న కల. ఆయన నన్ను ఒక రామబాణంలా ఇండస్ట్రీలోకి వదిలారు. ఇప్పుడీ చిత్రంతో నన్ను ఓ సూపర్ హీరోలా ఇక్కడ నిలబెట్టారు. నిర్మాత నిరంజన్‌రెడ్డి ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ లా నిలబడ్డారు. ఈ సినిమా ఆయన కోసం పెద్ద విజయం సాధించాలి. ఈ సినిమాకి పనిచేసిన డీవోపీ, సంగీత దర్శకులు.. టీంలో ప్రతి ఒక్కరూ అహర్నిశలు కష్టపడ్డారు. అమృత, వరలక్ష్మీ, వినయ్ రాయ్ అందరూ సినిమా సక్సెస్ కోసం పనిచేశారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సంక్రాంతికి వెంకటేష్ గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారి సినిమాలు వస్తాయి. వారి చిత్రాల్లో నటిస్తూ పెరిగినవాడిని. అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి. అందులో హనుమాన్ సినిమా కూడా వుండాలి. హనుమాన్ సంక్రాంతికి వస్తుంది. ఈ సినిమా నిలబడుతుంది. మమ్మల్ని నిలబెడుతుంది. ఇదొక సూపర్ హీరో సినిమా. ఇందులో వినోదం, యాక్షన్, థ్రిల్.. అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. జనవరి 12న తప్పకుండా సినిమా చూడండి’ అని కోరారు
హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ… దేవుడు మనిషి రూపంలో వస్తారని అంటారు. అలా చిరంజీవి గారు మా సినిమాని బ్లెస్ చేయడానికి రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇందులో మీనాక్షి పాత్ర చేస్తున్నాను, నా కెరీర్ లో చాలా స్పెషల్ గా వుంటుంది. తేజ అద్భుతంగా నటించారు. టీంలో పని చేసిన అందరికీ థాంక్స్. అందరూ తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు
నిర్మాత కె నిరంజన్ రెడ్డి .. ఈ వేడుకు వచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. దర్శకుడు ప్రశాంత్ వర్మ అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. తేజ, అమృత, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్ టీం అందరికీ థాంక్స్ . చాలా గొప్ప విజన్ తో ఈ చిత్రం తీశాం. తప్పకుండా అందరూ జనవరి 12న చిత్రాన్ని చూడాలి’’ అని కోరారు
వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రంలో చక్కన్ని పాత్రని ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మకి థాంక్స్. తేజకి ఆల్ ది బెస్ట్. ఇందులో అంజమ్మ పాత్ర చేశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరూ చూడాలి’’ అని కోరారు.
డైరెక్టర్ కేవీ అనుదీప్ మాట్లాడుతూ… ఈ వేడుకకు విచ్చేసిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఈ సినిమాతో తేజ నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని కోరుకుంటున్నాను. అందరూ సినిమాని థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు
బివిఎస్ రవి మాట్లాడుతూ.. దీక్ష, పట్టుదల, లక్ష్యం కోసం సరైన గురి, కర్తవ్య భక్తి కోసం ఆంజనేయ స్వామీని పూజిస్తాం. ఇవన్నీ వున్న ఆయన సూపర్ గాడ్ అయ్యారు. ఇవన్నీ వున్న చిరంజీవి గారు సూపర్ హ్యూమన్ అయ్యారు. ఈ క్యాలిటీస్ అన్నీ పెట్టి ఈ సినిమాని అద్భుతంగా చేశాడు ప్రశాంత్ వర్మ. తేజసజ్జాకి ఆల్ ది బెస్ట్. టీం అందరికీ అభినందనలు. చిరంజీవి గారు ఈ వేడుకకు రావడమే సూపర్ సక్సెస్. జై హను మాన్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దాశరధి శివేంద్ర, సాయిబాబు, గౌర హరి, నాగేంద్ర, కృష్ణ సౌరభ్, ఎస్ బీ రాజు, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, అనుదీప్, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్ మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.