Coolie First Review: ‘కూలీ’ ఫస్ట్‌ రివ్యూ: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన బహుళ అంచనాల చిత్రం ‘కూలీ’. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై తొలి సమీక్షను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ అందించారు. చిత్రాన్ని ముందుగానే వీక్షించిన ఆయన, ‘కూలీ’ ఒక పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ అని ప్రశంసించారు.

తన సోషల్ మీడియా వేదికగా ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ, “రేపు విడుదల కానున్న ‘కూలీ’ సినిమాను చూశాను. ఈ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌లోని ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో ఆస్వాదించాను. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయం” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయనిధి ప్రశంసతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆయన రివ్యూను చిత్ర బృందం కూడా స్వాగతించింది, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

‘కూలీ’ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

విడుదలకు ముందే, ముఖ్యంగా ఓవర్సీస్‌లో ‘కూలీ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ట్విట్టర్‌లో కూడా సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తోంది, అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పులివెందుల జగన్ గెలుపు || Analyst Purushotham Reddy About Pulivendula ZPTC Election Results || TR