తమిళనాడు రాజకీయాల్లో మీసం మెలిసిన నటుడు కమల హాసన్ ఒకడుగు వెనకేశారు.
కమల్ హాసన్ తమిళనాడులోని అభిమానులను బాగా నిరుత్సాహ పరిచారు. రాజకీయాలను మారుస్తానని హూంకరిస్తూ కొత్త పార్టీ మక్కల్ నీధి మయమ్ స్థాపించారు.
ఆయన పార్టీ ఉప్పెనాల ఉరికొచ్చి అధికారంలోకి వస్తుందనుకున్నారు. అయితే, యాంటి క్లయిమాక్స్ చూపించారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి అందరిని షాక్ కు గురి చేశారు. కొత్తగా పార్టీన నేత ఎన్నికల్లో పోటీచేయకపోవడమేమిటి? ఎవరికి అర్థంకావడం లేదు.
ఆయన ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చూపిస్తారని ఆశించిన వాళ్లందరూ ఇపుడు గందరగోళంలో పడిపోయారు. కొయంబత్తూర్ లోని ఒక ర్యాలీ లో మాట్లాడుతూ ఆయన తన నిర్ణయం ప్రకటించారు. తమిళనాడులో పోలింగ్ ఏప్రిల్ 18 న జరుగుతూ ఉంది.
కమల్ ఫాన్స్ ఎందుకు షాక్ కు గురవుతున్నారంటే, మొన్నామధ్య ఆయన రజినీ కాంత్ మీద చేసిన వ్యాఖ్యను వాళ్లింకా మరిచిపోలేదు. తమిళ సూపర్ స్టార్ కూడా రజినీ కాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఆయనకూడా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అయితే, ఏమయిందో ఏమో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీని మీద కమల్ హాసన్ బాగా చరకలంటించారు. రెజ్టింగ్ అంతా సిద్హయ్యాక, బరిలోకి వచ్చి, సారి ఈ రోజు ఫైట్ చేయలేనని ఎవరయినా చెబుతారా? ఇంతవరకు తొడలు చరిచారు, ఎందుకు, ఉత్త సౌండ్ చేయడానికేనా అని ఎగతా ళి చేశారు. ఈ మాట అని నెలకూడా కాలేదు. ఇపుడు తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటిస్తే, రజినీ ఫ్యాన్స్ మధ్య తమకు ముఖం చెల్లదని వారు బాధపడుతున్నారు. అసలే తమిళనాడులో ఫాన్ రాజకీయాలెక్కువ.
కొయంబత్తూరు నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు డా ఆర్ మహేందరన్ పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. అదే విధంగా మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తి మీద శివగంగలో కవి స్నేహన్ పోటీ చేస్తారని మాత్రం ప్రకటించారు.
ఎందుకు పోటీ చేయడం లేదు…
‘రథంలో కూర్చోవడం కంటే రథాన్ని లాగాలని అనుకుంటున్నాను. పార్టీ కార్యకర్తలంతా నేను పోటీచేయాలని అనుకుంటున్నారు. అయితే, నేను పోటీ లో ఉండరాదని అనుకుంటున్నాను. ఎన్నికల్లో నిలబడుతున్న పార్టీ అభ్యర్థులంతా నా ప్రతిరూపాలే. నేను పార్టీ ని ముందుండి నడిపిస్తాను,’అని ఆయన ర్యాలీ లో ప్రకటించారు.కమల్ హాసన్ రామనాథపురం లేదా సౌత్ చెన్నై నుంచి పోటీ చేస్తానని, ఆమేరకు ప్రకటన వెలవుడుతుందని ఎదురుచూస్తున్నపుడు ఈ యాంటి క్లయిమాక్స్ ఎదురయింది.
తమిళనాడు,పుదుచ్చేరిలతో కలసి మొత్తం 40 లో క్ సభ స్థానాలకు అభ్యర్థులను నిలబెడతామని, అదే విధంగా ఉప ఎన్నికలు జరగుుతున్న 18 అసంబ్లీ స్థానాలకు కూడా పార్టీ అభ్యర్థులుంటారని ఆయన చెప్పారు.