పెళ్లి బరాత్ తో బుల్లెట్ల వర్షం… పెళ్లికూతురి సోదరుడు మృతి…?

సాధారణంగా పెళ్లి వేడుకలలో బంధువుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి చిన్న చిన్న గొడవలు కొన్ని సందర్భాలలో మాట మాట పెరిగి తీవ్రంగా మారిపోతాయి. పెళ్లి వేడుకలలో చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడమే కాకుండా హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల కూడా పెళ్లి బరాతలో తమకు నచ్చిన పాట పెట్టనందుకు కొంతమంది యువకులు పెళ్లికి వచ్చిన వారి మీద దాడి చేయడమే కాకుండా పెళ్లికూతురి సోదరుడిని దారుణంగా కాల్చి చంపారు. ఈ దారుణ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే… కృష్ణగఢ్ ఓపీ పరిధిలోని పక్డి గ్రామానికి చెందిన అభిషేక్ సింగ్ ఉపాధ్యాయ జంక్షన్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల తమ బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు అభిషేక్ సింగ్ హాజరు అయ్యాడు. ఇటీవల జరిగిన ఈ వివాహ వేడుకలో బరాత్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి ఊరేగింపు అర్రాస్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంఝౌవాకు చేరుకుంది. ఈ ఊరేగింపులో బంధు మిత్రులందరికీ ఎంతో ఆనందంగా నృత్యం చేశారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన కొంతమంది యువకులు అక్కడికి వచ్చి తాము కోరిన పాటలు ప్లే చేయమని అడిగారు.

అయితే బంధువులు అందుకు నిరాకరించడంతో వారితో యువకులు గొడవపడ్డారు. ఆ తర్వాత మరి కొంతమంది యువకులు అక్కడికి వచ్చి మరో పాటను ప్లే చేయమని డిమాండ్ చేశారు. అయితే వారికి నచ్చజెప్పేందుకు అభిషేక్ అక్కడికి వచ్చాడు. దీంతో వారు అభిషేక్ చెప్పేది వినకుండా అతనిపై దాడి చేసి కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతలో ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అభిషేక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పెళ్లి వీడియో ఆధారంగా ఈ దారుణానికి పాల్పడిన నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.