రైతన్నలకు గుడ్ న్యూస్…12 వ విడత పీఎం కిసాన్ సాయం విడుదల?

దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతన్నలలో ఆదుకోవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చాయి. ఈ పథకాల ద్వారా రైతన్నలకు ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా ఎన్నో విషయాలలో వారికి చేయూతగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకుంటుంది.

పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా 11 కోట్ల మంది రైతన్నలకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ 11 కోట్ల మంది లబ్ధిదారులకు గాను రూ.16వేల కోట్లను ఆర్థిక సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే రైతన్నలకు రూ.2.16లక్షల కోట్ల సాయం అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇటీవల ఢిల్లీలో పుసా క్యాంపస్‌లో రెండు రోజులపాటు జరగతున్న ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ – 2022’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ‘పీఎం కిసాన్‌’ 12వ విడత ఆర్థిక సాయం విడుదల చేయడంతోపాటు ‘వన్‌ నేషన్‌ వన్‌ ఫర్టిలైజర్‌’ అనే పథకాన్నీ కూడా ప్రారంభించారు. ఈ పథకం లో భాగంగా దేశవ్యాప్తంగా 600 పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలో అర్హురైన రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2000 చొప్పున ఏడాదికి మూడు విడతల్లో ఈ ఆర్థిక సహాయాన్ని రైతుల అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు.