లేటు రీమేక్ పోటు – ‘మన్మథుడు -2’ రివ్యూ!

లేటు రీమేక్ పోటు – ‘మన్మథుడు -2’ రివ్యూ!

కింగ్ నాగార్జున తన వయస్సుకి సూటయ్యే రోమాంటిక్ డ్రామెడీకి పాల్పడ్డారు. రకుల్ ప్రీత్ సింగ్ ని జోడీగా నటింపజేసుకుంటూ, రాహుల్ రవీంద్రన్ కి దర్శకత్వం అప్పగించి, భారీ పెట్టుబడి తో మన్మథుడు -2 గా ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు విచ్చేశారు. ఈ ప్రయోగం ఆశించిన విధంగా విచ్చుకుందా, గుచ్చుకుందా ఓసారి చూద్దాం…

కథ
సాంబశివరావు అలియాస్ శామ్ (నాగార్జున) ఒక పర్ఫ్యూమర్. ఎప్పుడో మూడు తరాల క్రితం వాళ్ళ తాత కొందరు తెలుగు వాళ్లతో పోర్చుగల్ లోని కాసాండ్రా లో స్థిరపడ్డాడు. అక్కడే వాళ్ళందరూ కిటకిట లాడే సంతానాన్ని ఉత్పత్తి చేసుకుని తెలుగు వాళ్ళతో నిండి పోయిన ఆ వూరి పేరుని కాసాంధ్రాగా మార్చుకున్నారు. శామ్ కి ఓ తల్లి (లక్ష్మి), పెళ్ళిళ్ళయిన ఇద్దరక్కలు, ఓ చెల్లెలూ (ఝాన్సీ, దేవదర్శిని, నిశాంతి), ఓ మామా (రావురమేష్), ఓ ఫ్రెండ్ కిషోర్ (వెన్నెల కిషోర్) వుంటారు. గతంలో ఓ అమ్మాయితో (కీర్తీ సురేష్) శామ్ ప్రేమ విఫలమై ఇక పెళ్ళే చేసుకోకూడదని అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూంటాడు. వయసు ముదిరిపోతూంటే ఓ రోజు తల్లి అల్టిమేటం ఇస్తుంది- మూడు నెలల్లో పెళ్లి చేసుకోవాలని. ఇది ఇష్టం లేని శామ్, అవంతిక (రకుల్) అనే రెస్టారెంట్ వెయిటర్ ని కాంట్రాక్టు మాట్లాడుకుని గర్ల్ ఫ్రెండ్ గా నటించమంటాడు. తీరా పెళ్లి కుదిరాక పెళ్ళికి రాకుండా పారిపోమ్మంటాడు. దీంతో మళ్ళీ తన తల్లి పెళ్లి మాట ఎత్తదని అంటాడు. ఈ ఒప్పందంతో శామ్ ఇంట్లో ప్రవేశించిన అవంతికతో శామ్ పథకం ఎలా బెడిసి కొట్టింది? అప్పుడేం జరిగింది?

ఎలావుంది కథ
2006 నాటి ‘ఐ డూ’ అనే ఫ్రెంచి మూవీని ఇప్పుడు రీమేక్ చేస్తే కాలం చెల్లిన కథయింది. పైగా ఇలాటి కథతో నాగార్జునే ‘గ్రీకు వీరుడు’ లో నటించారు. మళ్ళీ ఈ రీమేక్ కి ఎందుకు పూనుకున్నారో గానీ ఇది యూత్ కీ, ఫ్యామిలీస్ కీ ఇప్పుడు ఆకర్షణీయమైన కథ కాలేకపోయింది. పెళ్లి ఇష్టం లేని హీరో హీరోయిన్ ని ఇంటికి తెచ్చుకుని నాటక ప్రహసనాలు నడపడం, చివరికి ఆ హీరోయిన్నే పెళ్లి చేసుకోవడమనే కథలు ఏనాడో వినోదాత్మక విలువ కోల్పోయాయి. పైగా ఫ్రెంచి మూవీస్ అంటే వరల్డ్ మూవీస్ కేటగిరీలోకి వస్తాయి. వరల్డ్ మూవీస్ హాలీవుడ్ మూవీస్ లా కాకుండా కమర్షియల్ గా చాలా పరిమితులతో వుంటాయి. తెలుగు రీమేక్ రిస్కే. దీన్ని పూర్తి స్థాయి రోమాంటిక్ కామెడీగా అయినా మార్చకుండా మధ్యలో రోమాంటిక్ డ్రామాగా చేశారు. ఇది మరీ బాక్సాఫీసు అప్పీల్ ని దెబ్బతీసింది.

ఎవరెలా చేశారు
రోమాంటిక్ పాత్రకి నాగ్ వన్నెతరగని గ్లామరెప్పుడూ పెట్టని ఆభరణమే. వయస్సుని జయిస్తున్నశరీర భాష ఇంకో ఎస్సెట్. వీటితో ఆయన సినిమా సాంతం ఆకర్షించారు. రోమాన్స్ హద్దులు మీరి కూడా నటించారు. అమ్మాయిలతో, వెన్నెలతో కిషోర్ తో ఫన్ చేసి బాగా నవ్వించారు. అలాగే విషాదంగా మారినప్పుడూ సీన్లు నిలబెట్టుకున్నారు. అయితే ఎంతసేపూ పెళ్లిని తప్పించుకునే పథకాలేసే పాత్ర కావడంతో, ఇంతకి మించి పాత్ర ఎదగక, ఎదగని పాత్ర కథనీ ఎదగనివ్వకపోవడంతో ఇంకేం చేసీ తన స్టార్ ఎట్రాక్షన్ తో ఈ రోమాంటిక్ డ్రామెడీని నిలబెట్ట లేకపోయారు.

రకుల్ ప్రీత్ సింగ్ మోసం చేయడానికి వచ్చి ఆత్మవిమర్శతో మారే పాత్రలో నటించడానికి అవకాశం దక్కింది. ఇలాగే లక్ష్మి, ఝాన్సీ సహా ఇతరులందరికీ ఫుటేజీ వున్న, నటించగల పాత్రలే దక్కాయి. సినిమాలో విషయమే వీళ్ళ టాలెంట్ కి కలిసిరాలేదు, వెన్నెల కిషోర్ కామిక్ యాక్టింగ్ సహా.

పెద్ద సంస్థల నిర్మాణంలో ప్రొడక్షన్ విలువలకి లోటు లేదు. పోర్చుగల్ దృశ్యాలు అద్భుతంగా వున్నాయి. నేటివిటీ సమస్య లేదుగానీ కంటెంటే కలిసిరాలేదు. సంగీతం గొప్పగా ఏమీ లేదు. ఛాయాగ్రహణం కళ్ళప్పగించి చూసేలా చేస్తుంది గానీ, దీనికీ మళ్ళీ మనసు అప్పగించి చూడలేని కంటెంటే అడ్డు. ఇక కిట్టూ రాసిన సంభాషణల విషయం. ఎప్పుడో వెళ్లి కాసాంధ్రాలో స్థిర పడ్డ వాళ్ళు కాబట్టి పాత్రలకి దూరదర్శన్ తెలుగే వచ్చు. బహుశా ఈటీవీ తెలుగు కూడా. మరీ చరవాణి అంటూ ‘ఈనాడు’ భాష వాడలేదు గానీ, చాలా కాలం తర్వాత సినిమా పాత్రలు అచ్చ తెలుగు మాట్లాడుతూంటే చెవులు చిల్ అవుతున్న ఫీలింగ్.

చివరికేమిటి
‘చిలసౌ’ అనే ఒక రాత్రి జరిగే ప్రేమ కథని విజయవంతంగా తీసిన రాహుల్ రవీంద్రన్, సీనియర్ రచయిత సత్యానంద్ గారితో కలిసి చేసిన స్క్రీన్ ప్లే ఈ కాలంలో ఫ్లాపవుతున్న లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలంత వుండీ లేని కథతో, డెప్త్ లేకుండా వుంది. నాగ్ పాత్ర గత విఫల ప్రేమనీ, ప్రస్తుత ప్లేబాయ్ తనాన్నీ చకచకా అరగంటలో ముగించి – లక్ష్మి పాత్ర అల్టిమేటంతో కథ ప్రారంభించెయ్యడం, ఇంటర్వెల్ దాకా దీన్ని రకుల్ ప్రీత్ తో కలిపి ఫన్ రైడ్ గా చేయడం వరకూ బాగానే వుంది. ఎప్పుడైతే నాగ్ నాటక మాడేడని ఇంటర్వెల్లో లక్ష్మి గ్రహించి అనారోగ్యం పాలయ్యిందో, అక్కడ్నించీ సెకండాఫ్ రుగ్మతల పాలయింది కథ. సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ కథకి పాత్రల కూర్పు కుదరలేదు. నాగ్ కి ప్రత్యర్ధి పాత్రగా లక్ష్మిని గుర్తించి వుంటే, ఈ రోమాంటిక్ కామెడీ యూత్ అప్పీల్ లేని రోమాంటిక్ డ్రామాగా సెకండాఫ్ మారేది కాదు. జానర్ మర్యాద, రస పోషణ చెడేవి కావు.

నాగ్ కి అల్టిమేటం ఇచ్చి కథ మొదలెట్టింది లక్ష్మి అయితే, ఆమెలో నాగ్ కి ప్రత్యర్ధి పాత్రని చూడకుండా మదర్ గానే చూపించే సెంటి మెంటుకి పోవడంతో, తద్వారా నాగ్ నాటకం బయట పెట్టి ఆ మదర్ ని అనారోగ్యం పాలు చేయడంతో అనివార్యంగా కథ విషాదచ్ఛాయల బారిన పడింది సెకండాఫ్ అంతా.

ఈ కథ డైనమిక్సుగా పెళ్లి తప్పించుకోవడానికి నాగ్ వేస్తున్న ఎత్తుల్ని చిత్తుచేసే ప్రత్యర్ధిగా లక్ష్మితో, ఆమె కూతుళ్ళతో, పూర్తి స్థాయి ఫన్నీ కమెడీగా చేసి వుంటే – ఎంతోకొంత ఈ కాలం కాని కాలం కథ సేవ్ అయ్యేదేమో.

దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
తారాగణం : నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ తదితరలు
స్క్రీన్ ప్లే : సత్యానంద్ – రాహుల్ రవీంద్రన్, మాటలు : కిట్టు, సంగీతం : చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : సుకుమార్
బ్యానర్ : నాగార్జున, కిరణ్
నిర్మాతలు : అన్నపూర్ణా స్టూడియోస్, ఆనంది క్రియేషన్స్, వయాకాం 18 మోషన్ పిక్చర్స్, మనం ఎంటర్ ప్రైజెస్
విడుదల : ఆగస్టు 9, 2019
2 / 5

―సికిందర్